బీభత్సం సృష్టించిన వడగండ్ల వాన

బీభత్సం సృష్టించిన వడగండ్ల వాన

రాష్ట్రంలో పలుచోట్ల శనివారం వర్షం కురిసింది. హైదరాబాద్ లో అర్ధరాత్రి వాన పడింది. నిజామాబాద్, జగిత్యాల జిల్లాలో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. జగిత్యాల జిల్లాలోని కోరుట్ల, మెట్ పల్లి, మల్లాపూర్,ఇబ్రహీంపట్నం మండలాల్లోని పలు గ్రామాల్లో అకాల వర్షం కురిసింది. సాయంత్రం కురిసిన ఈదురు గాలులు వర్షానికి మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ లో అమ్మకానికి ఉంచిన పసుపు, కందులు తడిసి ముద్దయ్యాయి. మేడిపల్లి మండలం కొండాపూర్ లో ఓ మర్రిచెట్టు విరిగిపడటంతో ట్రాక్టర్ నుజ్జునుజ్జు అయింది.

శనివారం వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వాతావరణం మేఘావృతంగా మారడంతో చాలా జిల్లాల్లో చలిగాలుల ప్రభావం పెరిగినట్టు అధికారులు తెలిపారు. పగలు మాత్రం ఎండ తీవ్రత అధికంగా ఉంటున్నది. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా అత్యధికంగా నిజామాబాద్‌లో 36 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అన్ని ప్రాంతాల్లోనూ గరిష్ఠ ఉష్ణోగ్రతలు 31 నుంచి 35 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. హైదరాబాద్‌లో గరిష్ఠ ఉష్ణోగ్రత 33 డిగ్రీలుగా, కనిష్ఠ ఉష్ణోగ్రత 19.9 డిగ్రీలుగా నమోదైంది. వారం రోజుల్లో ఎండలు తీవ్రమవుతాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.