రాష్ట్రమంతా వానలు, వరదల బీభత్సం

రాష్ట్రమంతా వానలు, వరదల బీభత్సం
  • రోడ్లు, బ్రిడ్జీలు తెగి వందలాది గ్రామాలకు కనెక్టివిటీ కట్ 
  • గోదావరి వెనక్కి తన్ని నీట మునిగిన మంచిర్యాల
  • వివిధ పట్టణాలు గ్రామాల్లోకి వరద నీరు
  • సురక్షిత ప్రాంతాలకు ప్రజల తరలింపు
  • కామారెడ్డి జిలాల్లో కాల్వలో కొట్టుకపోయి ఒకరి మృతి

ఐదురోజులుగా ఎడతెరిపి లేకుండా పడ్తున్న వానలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. బుధవారం ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు గోదావరి, దాని ఉప నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఆదిలాబాద్, నిర్మల్​, ఆసిఫాబాద్​, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్​భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వరదల ఎఫెక్ట్​ తీవ్రంగా ఉంది. ఎల్లంపల్లి, కాళేశ్వరం ప్రాజెక్టుల వల్ల గోదావరి వెనక్కి తన్ని  మంచిర్యాల, మంథని లాంటి పట్టణాలు, అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.  భైంసా, నిజామాబాద్, కరీంనగర్​,  పెద్దపల్లి లాంటి పట్టణాల్లోనూ వివిధ కాలనీలు జలమయమయ్యాయి.  భారీ వర్షాలు, వరదల కారణంగా రోడ్లు, బ్రిడ్జిలు తెగి వందలాది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.    

ఆదిలాబాద్ జిల్లాలో :-
ఆదిలాబాద్ జిల్లాలో 13  గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. 1,743 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో వందలాది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గూడెన్ ఘట్ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండంతో తిర్యాణి నుంచి ఆసిఫాబాద్ కు వచ్చే సుమారు 50 గ్రామాలకు కనెక్టివిటీ కట్​అయింది. పెద్ద వాగు బ్యాక్ వాటర్ వల్ల దహెగాం మండలంలోని ఇట్యాల, రాళ్లగూడ, పెసరిగుంట, అయిన, పెసరిగుంట, రాళ్లగూడ  జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి.  ప్రాణహిత, పెన్ గంగా, పెద్ద వాగులు ఉప్పొంగడంతో  పెంచికల్ పేట్, చింతలమానేపల్లి మండలాల్లోని16 గ్రామాలు  వరదలో చిక్కుకున్నాయి.  

బర్రెలు కడిగేందుకు వెళ్లి ఒకరి మృతి..
నిజామాబాద్ జిల్లా మంచిప్ప చెరువు అలుగు పోయడం, పులాంగ్ వాగు ఉధృతంగా ప్రవహించడంతో​పట్టణంలోని దుబ్బ ప్రాంతం,  వినాయకనగర్, బైపాస్ రోడ్, న్యూ కలెక్టరేట్, కంఠేశ్వర్, మాణిక్ బండార్ ఎక్స్ రోడ్డు, అర్సపల్లి తదితర కాలనీల్లోకి వరద నీరు పోటెత్తింది.  బుధవారం మెండోర మండలంలో అత్యధికంగా 23.9 సెంటీమీటర్ల  వర్షపాతం నమోదైంది.  వరద కారణంగా  జిల్లాలో కాజ్​వేలు, పాత బ్రిడ్జిలున్న 92 చోట్ల  రాకపోకలను అధికారులు నిలిపివేశారు. నందిపేట  పడిగెల చెరువుకు గండిపడి.. 750 ఎకరాల పంట కొట్టుకపోయింది. కామారెడ్డి జిల్లాలో 32 ఇండ్లు కూలిపోయాయి. ఎల్లారెడ్డి మండలం హాజీపూర్ తండాకు చెందిన సభావత్ శేఖర్ (25)  బర్రెలను కడిగేందుకు వెళ్లి   గ్రామ శివారులోని పోచారం కాల్వ లో  పడి చనిపోయాడు.    

మంథనిలో నీటమునిగిన ఎంసీహెచ్​..
కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో అత్యధికంగా 18.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.  చొప్పదండి మండలంలో  పంది వాగు ఉధృతితో ఆర్నకొండ, రాగంపేట, రెవెల్లి, పెద్దకుర్మపల్లి, గోపాల్ రావ్ పేట జలమయమయ్యాయి. రామడుగు బ్రిడ్జి పై నుంచి  వరద నీరు పోవడంతో   రామడుగు, గుండి, గోపాలరావు పేట, జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలోని పలు గ్రామాలకు రాక పోకలు నిలిచాయి. కరీంనగర్​ సిటీలోని పలు కాలనీలు నీటమునిగాయి. - పెద్దపల్లి జిల్లాలో బుధవారం భారీ వర్షాలు పడ్డాయి. ఎలిగేడు మండలంలో  అత్యధికంగా 11సెంటీమీటర్ల  వర్షపాతం నమోదైంది. వరదల వల్ల   మంథని నుంచి భూపాలపల్లి  ప్రధాన రహదారి బందయ్యింది. జిల్లావ్యాప్తంగా 1,000 మందిని  సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మంథని ఎంసీహెచ్ పూర్తిగా మునిగిపోయింది. జగిత్యాల జిల్లా కోరుట్ల లో అత్యధికంగా 12. 9 సెంటీమీటర్ల  వర్షపాతం నమోదైంది. జగిత్యాల పట్టణంలోని గోవింద్ పల్లి, నాగేంద్ర నగర్ జలదిగ్బంధం లో చిక్కుకుకున్నాయి. మెట్​పల్లి మండలం మేడిపల్లి పెద్ద చెరువు కట్ట తెగిపోయి వరద నీరు నేషనల్ హై వే 63 పై ప్రవహిస్తోంది. నిజామాబాద్, జగిత్యాల జిల్లాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కోరుట్ల లోని 9,10, 11 వార్డుల్లో వరదలలో చిక్కుకున్న జనాలను జేసీబీ సహాయంతో బయటకు తీసుకొచ్చారు. ఎస్సారెస్పీ నుంచి 4 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో ముంపు గురయ్యే అవకాశంఉన్న ఇబ్రహీం పట్నం మండలం ఎర్దండి గ్రామస్తులను ప్రభుత్వ స్కూల్ కు తరలించారు.  నిర్మల్​ జిల్లా భైంసాలో ఆటోనగర్​, వినాయక్​నగర్, గోకుల్​నగర్, గణేశ్​నగర్, రాహుల్​నగర్​ తదితర కాలనీలు నీట మునిగాయి. ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌‌ 50 గేట్లు ఎత్తి 12 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదలడంతో పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని  నది ఒడ్డున ఉన్న మల్కాపూర్‌‌, నర్రశాలపల్లి, న్యూపోరట్‌‌పల్లి, సప్తగిరి, గంగానగర్‌‌ రెడ్డి కాలనీ, రామగుండం పాములపేట ప్రాంతాల్లోని 200 వరకు ఇళ్లు నీట మునిగాయి. 500 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. సప్తగిరి కాలనీలోని సాంఘీక సంక్షేమ హాస్టల్‌‌, బీసీ గురుకుల హాస్టల్‌‌ను గోదావరి నీరు చుట్టముట్టగా, ప్రహారీ పగలగొట్టి 400 మంది స్టూడెంట్స్​ను పలు ఫంక్షన్‌‌ హాళ్లకు తరలించారు. గోదావరిఖని గంగానగర్‌‌ ప్రాంతంలోని లారీల అడ్డాలో  28 లారీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రూ.20 లక్షల విలువైన టైర్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి. 



జర్నలిస్టు ఆచూకీ దొరకలే
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం రామోజీ పేట్ బ్రిడ్జి వద్ద మంగళవారం రాత్రి వరద నీటిలో గల్లంతయిన జర్నలిస్ట్ జమీల్ జాడ బుధవారం కూడా లభించలేదు. వరదలో చికుకున్న 9 మంది రైతులను కాపాడేందుకు మంగళవారం రెస్క్యూ టీం వెళ్లింది. ఈ వార్త కవరేజీ కోసం వెళ్లి తిరిగి వస్తుండగా జమీర్ కారు రామోజీపేట్ కల్వర్టు వద్ద వరదలో కొట్టుకపోయింది. మంగళవారం అర్ధరాత్రి వరకు గాలింపు జరిపినా ఫలితం లేకుండా పోయింది. బుధవారం ఉదయం తిరిగి క్రేన్ తో సహాయక చర్యలు చేపట్టారు. కారు వరదలో చాలా దూరం కొట్టుకపోయి ఉంటుందని రెస్క్యూ టీం అంచనా వేస్తోంది. వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో గజ ఈతగాళ్లు బుధవారం రాత్రి సహాయక చర్యలు నిలిపివేశారు.