రోగాలు ముసురుతున్నయ్..వేల మందికి జ్వరాలు, డయేరియా

రోగాలు ముసురుతున్నయ్..వేల మందికి జ్వరాలు, డయేరియా
  • వాతావరణ మార్పులు, కలుషిత నీటితో ముప్పు
  •  హెల్త్ క్యాంపుల్లో వారం రోజుల్లోనే 16 వేల మందికి ట్రీట్‌మెంట్
  • పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ వెల్లడి.. జాగ్రత్తగా ఉండాలని సూచన

హైదరాబాద్‌, వెలుగు: రాష్ట్రంలోని వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో రోగాలు ముసురుకుంటున్నాయి. నీళ్లు రోజుల తరబడి నిలిచిపోవడం, డ్రైనేజీలు, చెత్తచెదారం, ఇతర వేస్టేజీ నీళ్లలో కలవడం, దోమలు, కంపు, కలుషిత వాతావరణంతో వేల మంది విష జ్వరాల బారినపడ్తున్నారు. జలుబు, దగ్గు, డయేరియా వంటివి చుట్టుముడ్తున్నాయి. ఇప్పటికే ఫ్లడ్‌ ఎఫెక్టెడ్ ఏరియాల్లో హెల్త్​ డిపార్ట్​మెంట్​ 182 క్యాంపులు పెట్టింది. వారం రోజుల్లోనే వాటిలో సుమారు 16 వేల మందికి ట్రీట్​మెంట్ అందించారు. ఇందులో 1,055 మంది విషజ్వరాలతో, 235 మంది డయేరియాతో బాధపడుతున్నారని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ చెప్పారు. మరో 930 మంది శ్వాస సంబంధ సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్టు గుర్తించామన్నారు. అయితే అనధికారిక లెక్కల ప్రకారం వేల మంది జ్వరాలు, ఇతర సీజనల్ డిసీజెస్‌తో బాధపడుతున్నట్టు డాక్టర్లు చెప్తున్నారు.

వరద బాధితుల కోసం ఏర్పాటు చేసిన క్యాంపుల్లో జలుబు, జ్వరంతో ఉన్న సుమారు 2 వేల మందికి కరోనా టెస్టులు చేశారు. ఇందులో 9 మందికి మాత్రమే పాజిటివ్ వచ్చింది. మిగతా వాళ్లంతా సీజనల్ రోగాలతో బాధపడుతున్నవాళ్లేనని హెల్త్​స్టాఫ్​ వెల్లడించారు. ప్రస్తుతం వాతావరణంలో తీవ్ర మార్పులు చోటుచేసుకుంటున్నందున వరదల ప్రభావం లేని ప్రాంతాల్లోనూ జ్వరాల ముప్పు ఉందని, అందరూ జాగ్రత్తగా ఉండాలని హెల్త్​ డిపార్ట్​మెంట్​హెచ్చరించింది.

ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే..

చేతులను తరచుగా శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అన్నం తినేముందు, తిన్న  తర్వాత తప్పనిసరిగా సబ్బు నీళ్లతో చేతులు కడుక్కోవాలి. వీలైతే హ్యాండ్‌‌ శానిటైజర్‌‌ దగ్గర ఉంచుకోవాలి. వేడిచేసి చల్లార్చిన నీరు తాగాలి. స్నానం చేసేటప్పుడు, బ్రష్ చేసేటప్పుడు పొరపాటున కూడా నీళ్లు  మింగకూడదు. కూరగాయలు కూడా గోరువెచ్చని నీటిలో కడిగి వాడితే మంచిది. ఆకుకూరలను మరింత ఎక్కువగా కడుక్కొని వండుకోవాలి. అప్పటికప్పుడు వండుకున్న వేడి పదార్థాలే తినాలి. బయటి ఆహారం పూర్తిగా మానేయటం బెటర్​ అని డాక్టర్లు చెప్తున్నారు. వాతావరణంలో వచ్చిన మార్పులతో శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గుతుందని.. వైరస్‌‌లు, బ్యాక్టీరియా మరింత తేలికగా వ్యాపిస్తాయని వివరిస్తున్నారు. అందుకే  జలుబు, దగ్గు వంటివి సీజన్ చేంజ్ టైంలో ఎక్కువగా వస్తాయని గుర్తు చేస్తున్నారు.

రోగాల ముప్పు ఉంది

ప్రస్తుత వాతావరణ మార్పులు, కలుషిత నీటితో సీజనల్ డిసీజెస్ పెరిగే ప్రమాదముంది. అజాగ్రత్తగా ఉంటే టైఫాయిడ్, డెంగీ, మలేరియా, కలరా, వాంతులు, డయేరియల్ డిసీజెస్ బారిన పడతారు. జ్వరాలతో వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. వరుసగా కురుస్తున్న వానలతో చాలా మంది జలుబు, వైరల్ ఫీవర్లతో హాస్పిటళ్లకు వస్తున్నారు. ఈ టైమ్‌లో వాటర్, ఫుడ్‌ విషయంలో ఎక్కువ కేర్ తీసుకోవాలి. తాగడానికి వేడి చేసి, చల్లార్చిన నీటినే వినియోగించుకోవాలి. ఇంట్లోనే వండుకుని వేడిగా ఉన్నప్పుడే తినేయాలి. వానలో, వాన నీటిలో తడవకుండా జాగ్రత్త పడాలి. పరిశుభ్రమైన దుస్తులనే వినియోగించాలి. నీరు ఎక్కువ రోజులు నిల్వ ఉంటే దోమలు పెరిగే అవకాశం ఉంటుంది. ఎక్కడా నీరు నిల్వ లేకుండా జాగ్రత్త పడాలి. చిన్న పిల్లలు, వృద్ధులు, గర్భిణుల విషయంలో ఎక్కువ కేర్ తీసుకోవాలి.

– డాక్టర్‌‌ మోహన్,జనరల్ ఫిజీషియన్, హైదరాబాద్

స్విచ్ ఆన్ చేస్తే షాక్

వీఎస్టీ సమీపంలోని నాగమయ్యకుంట బస్తీలోకి నాలా పొంగి వరద ముంచెత్తడంతో స్థానికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని శనివారం రాత్రంతా జాగారం చేశారు. పిల్లాపాపలను తీసుకుని దగ్గర్లోని బిల్డింగ్స్​ పైన తలదాచుకున్నారు. రాత్రి వర్షానికి ఈ బస్తీలో రెండిండ్లు కూలిపోయాయి. ఇంట్లో స్విచ్​ ఆన్​ చేస్తే షాక్​ వస్తున్నదని, వాన పడితే కంటి మీద కునుకు ఉండడం లేదని స్థానికులు వాపోతున్నారు. 650 కుటుంబాలు ఉన్న ఈ బస్తీ పక్కనే ఉన్న నాలాకు ఒక వైపు(డబుల్ బెడ్ రూమ్​ ఇండ్ల పైపు) ఎత్తయిన కాంక్రీట్​ గోడ కట్టడంతో వరద నీళ్లన్నీ తమ ఇండ్ల మీదికే వస్తున్నాయని వారు అంటున్నారు