ఉత్తరాఖండ్‌‌లో వర్ష బీభత్సం

ఉత్తరాఖండ్‌‌లో  వర్ష  బీభత్సం
  • కొండచరియలు విరిగిపడి నలుగురు మృతి.. స్కూళ్లు క్లోజ్

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌‌లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. సోమవారం కురిసిన భారీ వర్షానికి తెహ్రీ జిల్లాలోని చంబాలో కొండచరియలు విరిగి రోడ్డు పక్కనే ఆగి ఉన్న వెహికల్స్ పై పడ్డాయి. ఈ ఘటనలో  నలుగురు చనిపోయారు. మృతుల్లో 4 నెలల శిశువు, ఇద్దరు మహిళలు ఉన్నారు. ఇప్పటి దాకా నాలుగు మృతదేహాలను వెలికి తీశామని తెహ్రీ సీనియర్ పోలీస్ ఆఫీసర్ నవనీత్ సింగ్ భుల్లారైడ్ వెల్లడించారు. గల్లంతైన మరొకరి కోసం గాలిస్తున్నామని చెప్పారు. సహాయక చర్యల్లో రాష్ట్ర విపత్తు సహాయ దళం(ఎస్డీఆర్ఎఫ్) సెర్చ్ అండ్ రెస్క్యూ సిబ్బంది పాల్గొన్నట్లు పేర్కొన్నారు.

రాష్ట్రంలో మరో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉండటంతో భారత వాతావరణ శాఖ(ఐఎండీ).. డెహ్రాడూన్, పౌరీ, నైనిటాల్, చంపావత్, బాగేశ్వర్ సహా  ఐదు జిల్లాల్లో  ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వర్షాల హెచ్చరికల నేపథ్యంలో అధికారులు తెహ్రీ జిల్లాలోని అన్ని పాఠశాలలను, అంగన్‌‌వాడీ కేంద్రాలను మూసివేస్తున్నట్లు ప్రకటించారు.

హిమాచల్‌‌లోనూ కుండపోత

ఈ నెల24 వరకు హిమాచల్ ప్రదేశ్​లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. చంబా, మండి జిల్లాల పరివాహక ప్రాంతాల్లో వరద ముప్పు ఉందని హెచ్చరించింది. భారీ వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడడం, ఆకస్మిక వరదలు, నదులు, కాలువలలో నీటి మట్టం పెరుగుతాయని.. పంటలు, పండ్ల తోటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని పేర్కొంది. ఉత్తరాఖండ్‌‌తో పాటు హిమాచల్ ప్రదేశ్​లోనూ ఆరెంజ్ అలర్ట్ అమలులో ఉంటుందని పేర్కొంది.