రాష్ట్రంలో మరో 4 రోజులు వానలు

రాష్ట్రంలో మరో 4 రోజులు వానలు

హైదరాబాద్‌‌, వెలుగు : రాష్ట్రంలో వారం రోజులుగా ముఖం చాటేసిన వానలు మళ్లీ జోరందుకుంటున్నాయి. రానున్న నాలుగు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే చాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం రాష్ట్రంలోని అనేక చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. టీఎస్‌డీపీఎస్‌ డేటా ప్రకారం ఒక చోట అతి భారీగా, మూడు చోట్ల భారీగా, 62 ప్రాంతాల్లో మోస్తరుగా, 172 చోట్ల తేలికపాటి, 117 ప్రదేశాల్లో అతి తేలికపాటి జల్లులు కురిశాయి. మహబూబాబాద్‌ జిల్లా ఉప్పరగూడెంలో 13 సెం.మీ., పెద్దపల్లి జిల్లా మల్యాలపల్లి, రామగుండంలో 7 సెంమీ., భద్రాద్రి కొత్తగూడెంలోని మల్కారంలో 6.8,  యాదాద్రి భువనగిరిలోని నందనంలో 6.2, మంచిర్యాలలోని నస్పూర్‌ లో 6, సూర్యాపేటలోని మామిళ్లగూడెంలో 5.9, ఖమ్మంలోని యెర్రపాలెంలో 5.8, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పెంట్లాంలో 4.6, కామారెడ్డి జిల్లా కొల్లూరులో 4.1 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం రికార్డయ్యింది.