
రాష్ట్రానికి 3 రోజుల రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఉపరితల ద్రోణి ప్రభావంతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. హైదరాబాద్ సహా పలు జిల్లాలో వర్షం పడింది. జిల్లాలో కురిసిన వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం
ఉపరితల ద్రోణీ ప్రభావంతో రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెదర్ ఆఫీసర్లు తెలిపారు. గురువారం హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం పడింది. కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, రాయదుర్గం ప్రాంతాల్లో గంట పాటు వర్షం పడింది. కరీంనగర్, ఆసిఫాబాద్, సిద్ధిపేటల్లోనూ వర్షాలు పడ్డాయి. నిజామాబాద్ లోని చందూర్ లో అత్యధికంగా 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిర్మల్ జిల్లా పెంబిలో 5.3, కామారెడ్డిలోని కొన్ని ప్రాంతాల్లో 3 నుంచి 4 సెంటీమీటర్లు, మెదక్ లోని లింగయ్ పల్లెలో 3.3, నిర్మల్ లో 2 నుంచి3 సెంటీమీటర్ల వర్షం పడింది.
వాగులో చిక్కుకున్నారు
రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగిపొర్లుతున్నాయి. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఏర్రపాహడ్, దేమే గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. సంతాయిపేట్ గ్రామ శివారులోని భీమేశ్వర వాగుకు వరద ప్రవాహం పెరగడంతో వ్యవసాయ పనుల కోసం వెళ్లిన 200 మంది కూలీలు వాగులో చిక్కుకుపోయారు. పోలీసులు, రెస్కూ టీమ్ లు స్పాటుకు చేరుకొని జేసీబీ సహాయంతో కూలీలను రక్షించారు. కామారెడ్డి జిల్లా రాంపల్లి తండా వాగులో ముగ్గురు వ్యక్తులు చిక్కుకున్నారు. తండాకు చెందిన బాలు, చంద్రం, దుపియా అనే ముగ్గురు చేపలు పట్టడానికి వెళ్లి అక్కడే చిక్కుకుపోయారు. చేపలు పడుతుండగా.. ఒక్కసారిగా వాగు ఉధృతి పెరిగింది. దీంతో.. చెట్టు పైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు ముగ్గురు యువకులు. వాగులో చిక్కుకున్న ముగ్గురిని పోలీసులు రక్షించారు. లైఫ్ జాకెట్లు, రోప్ సాయంతో ఒడ్డుకు చేర్చారు.
కుమ్రంభీం జిల్లా జైనూర్ మండలంలోని వాగులో కారు కొట్టుకుపోయింది. అనార్ పల్లికి చెందిన రాజేష్ అంద్ గూడ వైపు నుంచి అనార్ పల్లి వస్తున్న క్రమంలో కారు అదుపుతప్పి వాగులోకి దూసుకెళ్లింది. లోలెవల్ వంతెన కావటంతో బ్రిడ్జిపై నీరు ప్రవహిస్తోంది. డ్రైవింగ్ చేస్తున్న రాజేష్ కూరులోంచి దూకి ప్రాణాలతో బయటపడ్డాడు. వాగు ఉధృతికి కారు కొట్టుకుపోయింది. నాగర్ కర్నూల్ జిల్లా సిరసవాడ దగ్గర దుందిభి వాగులో అకస్మాత్తుగా నీటి ప్రవాహం పెరిగింది. మాదారం నుంచి సిరసవాడ వైపు వస్తున్న ఆటో నీటి ఉధృతికి రోడ్డుపై నుంచి కిందికి పడిపోయింది. ఆటోలో ప్రయాణిస్తున్న శ్రీశైలం, నిరంజన్ ఇద్దరు బయపడ్డారు. రోడ్డుపై గుంతలు ఉండడంతో ఆటో అదుపుతప్పి పక్కనున్న వాగులోకి ఒరిగిపోయిందంటున్నారు స్థానికులు. వాగుపై బ్రిడ్జి నిర్మించాలంటూ మొర పెట్టుకున్నా ఎవరు పట్టికుంచుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన 10వేల రూపాయల వరద సాయం వెంటనే ఇవ్వాలన్నారు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరద బాధితులు. 10వేలు ఇస్తామని ప్రకటించి 10రోజులు దాటినా అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. అధికారులు 25 కిలోల బియ్యం, పప్పులు మాత్రం ఇచ్చారని తెలిపారు.
వారం ముందుగానే సాగు నీరు విడుదల
నాగార్జున సాగర్ ఎడమ కాల్వ కింద ఉన్న ఆయకట్టు కోసం నీటిని విడుదల చేశారు. ఎగువ నుంచి భారీ వరద రావడంతో... వారం ముందుగానే సాగు నీరు విడుదల చేశారు. సాగర్ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 312 టీంసీలు కాగా..ప్రస్తుతం 210 టీఎంసీలుగా ఉంది. ప్రస్తుతం ఇన్ ఫ్లో 63వేల 540 క్యూసెక్కులుగా ఉండగా.. పవర్ హౌజ్ నుంచి 24 వేల 774 క్యూసెక్కులు.. SLBC కి 16 వందల 50 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఇక హైదరాబాద్ లో వర్షాలు తగ్గుముఖం పట్టటంతో జంట జలాశయాలకు వరద తగ్గింది. గండిపేట పూర్తిస్థాయి నీటిమట్టం 17వందల 90 ఫీట్లు కాగా.. ప్రస్తుతం 17వందల 87 ఫీట్ల నీటిమట్టం ఉంది. 18 వందల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా.. 2 వేల 442 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలిపెడుతున్నారు. గండిపేట చెరువు నీటి విడుదలతో మంచిరేవుల నుంచి నార్సింగికి వెళ్లే రోడ్డుపై వరద ప్రవహిస్తోంది. హిమాయత్ సాగర్ కు 4 వందల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా.. ఒక గేటు ఎత్తి 330 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
మూసీకి భారీ వరద
మూసీ నదికి ఇన్ ఫ్లో తగ్గింది. దీంతో మూసారాంబాగ్ బ్రిడ్జి కింద నుంచి నీటి ప్రవాహం కొనసాగుతోంది. అటు చాదర్ ఘాట్ చిన్న బ్రిడ్జికి ఒక అడుగు కింది నుంచి ప్రవాహం కొనసాగుతోంది. మూసీ భారీ వరదతో మూసారాంబాగ్ బ్రిడ్జి చాలా వరకు దెబ్బతిన్నది. మూసీ నది ఉధృతితో ముసారాంబాగ్ బ్రిడ్జ్ పై ఇంకా ట్రాఫిక్ ఆంక్షలు కంటిన్యూ అవుతున్నాయి. బ్రిడ్జ్ పై రాళ్లు, చెత్త, బురద పేరుకుపోయింది. బ్రిడ్జ్ పై ఉన్న రాళ్లను అధికారులు తొలగిస్తున్నారు. ట్రాఫిక్ మళ్లింపుతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.