రాష్ట్రవ్యాప్తంగా మరో రెండురోజులు వర్షాలు

రాష్ట్రవ్యాప్తంగా మరో రెండురోజులు వర్షాలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా మళ్లీ మబ్బు వాతావరణం ఏర్పడింది. చాలా ప్రాంతాల్లో సోమవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలో కొనసాగుతున్నదని తెలిపింది. మొత్తం తొమ్మిది జిల్లాలకు ఆరంజ్ అలర్ట్ ప్రకటించింది. ఆదిలాబాద్, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. ఆదివారం రాత్రి హైదరాబాద్​లో భారీ వర్షం పడింది. ఇక శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 24 గంటల్లో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో అత్యధికంగా 5.9 సెంటీమీటర్లు, ములుగు జిల్లా ఏటూరునాగారంలో 4 సెంటీమీటర్ల వాన పడింది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం 30 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యల్పంగా హన్మకొండలో 27 డిగ్రీలు, అత్యధికంగా నల్గొండలో 31 డిగ్రీలు రికార్డయ్యింది.