ముసురు వదుల్తలేదు..

ముసురు వదుల్తలేదు..

రాష్ట్రంలో అనేక చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు

బంగాళాఖాతంలో కొనసాగుతున్నఅల్పపీడనం

హైదరాబాద్‌, వెలుగు: రాష్ట్రాన్ని ముసురు వదలడంలేదు. అన్ని జిల్లాల్లోనూ ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. అనేక చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. వాగులు, వంకలు, చెరువులు నిండుకుండలా మారాయి. అనేక చోట్ల వాన నీరు రోడ్డుపై చేరడంతో రవాణా వ్యవస్థకు అంతరాయం కలిగింది. కొన్ని చోట్ల చెట్లు, కరెంట్‌ స్తంభాలు నేలకొరిగాయి. పలు గ్రామాల్లో కరెంట్‌ సరఫరాలో ఇబ్బందులు ఎదురయ్యాయి.

అన్ని జిల్లాల్లో మస్తు వానలు

ఈ వర్షాకాలంలో అన్ని జిల్లాల్లో మస్తు వానలు పడ్డాయి. ఆదివారం వరకు 32 జిల్లాల్ లో సాధారణ వర్షపాతం నమోదు కాగా, సోమవారం 33 జిల్లాల్లో సాధారణం, అంతకంటే ఎక్కువగా వానలు పడ్డాయి. ఈ సీజన్ లో ఇప్పటి దాకా 498.6 మి.మీ. వర్షపాతం కురుస్తుందని అంచనా వేయగా, 713.6 మి.మీ. వర్షపాతం రికార్డయ్యింది. 14 జిల్లాల్లో అతి భారీ, 11 జిల్లాల్లో భారీ, 8 జిల్లాల్లో నార్మల్‌ రెయిన్ ఫాల్‌  రికార్డయ్యింది. వనపర్తి జిల్లాలో 143 శాతం వానలు కురిశాయి.

ములుగు జిల్లాలో తగ్గని వాన జోరు..

ములుగు జిల్లాలో వాన జోరు తగ్గడంలేదు. కుండపోత వర్షాలు పడుతున్నాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు ములుగు జిల్లా వెంకటాపురంలో 17 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయ్యింది. ఆగస్టులో 119 శాతం అధికంగా వానలు ఈ ఏడాది వర్షాకాలంలో జూన్‌ నుంచే భారీ వర్షాలు కురుస్తున్నాయి. గతేడాది మాత్రం మొదటి రెండు నెలలు వర్షాభావ పరిస్థితు లు నెలకొన్నాయి. ఆగస్టు మధ్యలో వర్షాలు ప్రారంభమయ్యాయి. ఈ సారి జూన్ లో 34 శాతం, జులైలో 9 శాతం అధికంగా వానలు పడ్డాయి. ఇక ఈ నెలలో కుండపోత వానలు పడ్డాయి. రాష్ట్రంలో ఈ నెలలో 17 తేదీ వరకు 125 మి.మీ. వర్షపాతం పడుతుందని అంచనా వేయగా, ఏకంగా 273 మి.మీ. వర్షపాతం రికార్డయ్యింది. ఇవే తేదీల్లో గతేడాదితో పోలిస్తే ఈసారి 60 శాతం వానలు అధికంగా పడ్డాయి.

ఇయ్యాల కూడా భారీ వర్షాలు

రాష్ట్రంలోని కొన్ని చోట్ల మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపింది.