మెదక్ ​జిల్లాలో పెరిగిన భూగర్భ జలమట్టం 

మెదక్ ​జిల్లాలో పెరిగిన భూగర్భ జలమట్టం 

మెదక్, వెలుగు : మెదక్ జిల్లాలో భూగర్భ జల మట్టం గణనీయంగా పెరిగింది. గతంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా 20 నుంచి 25 మీటర్ల లోతుకు పడిపోయిన సందర్భాలు ఉన్నాయి. అనేక ఏండ్ల తర్వాత ఈసారి భూగర్భ జలమట్టం అనూహ్యంగా పెరిగింది. తూప్రాన్​ మండలం మల్కాపూర్​లో భూగర్భ జలమట్టం అతి తక్కువ లోతులో ఉంది. ఇక్కడ గతేడాది సెప్టెంబర్​లో భూగర్భజలమట్టం 4.6 మీటర్ల లోతులో ఉండగా, ఈసారి సెప్టెంబర్​లో 1.20 మీటర్ల లోతుకు చేరడం విశేషం. ఆ తర్వాత మెదక్ మండలం పిల్లికొటాల్ లో ప్రస్తుతం 1.40 మీటర్ల లోతులో, ఇతర చాలా మండలాల్లో 5 మీటర్ల లోపులోనే నీటి మట్టం ఉంది.

ఫుల్​ హ్యాపీ.. 

ఈసారి యాసంగి పంటల సాగుకు, తాగునీకి తిప్పలు తప్పనుందని జిల్లా రైతులు, ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో లక్షకు పైగా అగ్రికల్చర్​ బోర్లు ఉండగా, ఇండ్లకు నీటి అవసరం కోసం తవ్వుకున్న బోర్లు మరో లక్ష వరకు ఉంటాయి. కొన్నేండ్లుగా వర్షాభావ పరిస్థితులు నెలకొంటుండటంతో భూగర్భ జలమట్టం 20 మీటర్ల లోతుకు పడిపోయింది. ఫలితంగా అగ్రికల్చర్​ బోర్లు గ్యాప్​ ఇచ్చాయి. వాటి ఆధారంగా సాగు చేసిన పంటలకు తడులు అందక ఎకరాల కొద్దీ ఎండిపోయాయి. దీంతో రైతులు చాలాసార్లు నష్టాలపాలయ్యారు. ప్రజలు గృహావసరాలకు కూడా నీళ్లు లేక ఇబ్బంది పడ్డారు. అలాంటిది ఈసారి సాధారణ వర్షాపాతానికి మించి రికార్డు స్థాయిలో వర్షాలు కురిశాయి. వానాకాలం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు వానలు పడుతూనే ఉన్నాయి. తూప్రాన్, మాసాయిపేట, వెల్దుర్తి, కొల్చారం, మెదక్​ మండలాల పరిధిలోని హల్దీ వాగు వరద ప్రవాహాన్ని సంతరించుకుంది. సంగారెడ్డి జిల్లాలోని సింగూర్​ ప్రాజెక్ట్​ నుంచి పలుమార్లు నీటిని దిగువకు విడుదల చేయడంతో మెదక్​ జిల్లాలోని చిలప్​ చెడ్, కొల్చారం, టేక్మాల్, పాపన్నపేట, మెదక్, హవేలీఘనపూర్​ మండలాల పరిధిలోని మంజీరా నదీ గలగల పారింది. ఆయా మండలాల పరిధిలో హల్దీ వాగు, మంజీరా నదీ మీద నిర్మించిన హల్దీ ప్రాజెక్ట్, వనదుర్గా ప్రాజెక్ట్, పలుచోట్ల నిర్మించిన చెక్ డ్యామ్ లు పూర్తిగా నిండి పొంగి పొర్లాయి. జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో చెరువులు, కుంటలు పూర్తిస్థాయిలో నిండాయి. ఫలితంగా భూగర్భ జలాలు అనూహ్యంగా పెరిగాయి.