వెంచర్లకూ రైతుబంధు!

వెంచర్లకూ రైతుబంధు!
  • రెవెన్యూ అధికారుల తప్పిదాలతో కొత్త వివాదాలు
  • 30 ఏళ్ల క్రితం ప్లాటింగ్ చేసిన భూములకు పాస్ బుక్స్
  • గుట్టుగా రైతు బంధు తీసుకుంటున్న పాత యజమానులు
  • నగరాలు, పట్టణాల శివారు ప్రాంతాల్లో వెలుగులోకి అక్రమాలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళన అనేక కొత్త వివాదాలకు తెరలేపింది. రెండు, మూడు దశాబ్దాల క్రితం పంచాయతీల పరిధిలో వెలిసిన వెంచర్లకు, నిర్మాణమైన కాలనీలకు రెవెన్యూ అధికారులు పట్టాదారు పాస్ బుక్స్ జారీ చేసిన ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పాస్ బుక్స్ పొందిన వ్యక్తులు దర్జాగా రైతుబంధు పొందుతున్నారు. అంతటితో ఆగకుండా ఎప్పుడో ప్లాట్లుగా చేసి అమ్ముకున్న భూములు మావేనంటూ తిరగబడుతున్నారు. కొందరైతే అత్యాశతో ప్లాట్లను చదును చేసి వ్యవసాయ భూమిగా చూపి ఇతరులకు అమ్మేస్తున్నారు. ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చాక ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. ఫలితంగా రైతు బంధు పేరిట ప్రజాధనం దుర్వినియోగం అవ్వడమేగాక పైసాపైసా కూడబెట్టుకుని ప్లాట్లు కొనుగోలు చేసిన వ్యక్తులకు ఆందోళన తప్పడం లేదు.

కోట్లాది రూపాయలు దుర్వినియోగం
ఉమ్మడి రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం తదితర నగరాల సమీపంలోని గ్రామాల్లో 3, 4 దశాబ్దాల క్రితం నుంచే పంచాయతీల అనుమతితో, అనుమతి లేకుండా వందలాది వెంచర్లు వెలిశాయి. కనీసం నాలా కన్వర్షన్ కూడా చేసుకోకుండానే రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్లాటింగ్ చేసి ప్లాట్లుగా అమ్మేశారు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో రిజిస్ట్రేషన్ అయిందనే భరోసాతో చాలా మంది ప్లాట్ల కొనుగోలుదారులు ఏండ్లు గడిచినా రెవెన్యూ రికార్డుల్లో మ్యుటేషన్ చేయించుకోలేదు. దీంతో భూరికార్డుల ప్రక్షాళన సమయంలో పాత ఓనర్ల పేర్లే రికార్డుల్లోకి ఎక్కాయి. వారికే పాస్ బుక్స్ కూడా జారీ కావడంతో గుట్టుచప్పుడు కాకుండా రైతుబంధు పొందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి భూములు 5 వేల ఎకరాలు ఉంటాయని అంచనా. దీంతో ఏటా కొట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగమవుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

24 ఏళ్ల కిందట ప్లాటింగ్ చేసిన భూమికి పాస్ బుక్స్
రంగారెడ్డి జిల్లా హయత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్ మండలం అబ్దుల్లాపూర్ రెవెన్యూ పరిధిలోని 62, 78 సర్వే నంబర్లలో సాహెబ్ నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన నీళ్ల ఈశ్వరయ్య కుటుంబానికి ఆరు ఎకరాల సాగు భూమి ఉండేది. ఈ భూమిని ప్లాట్లుగా చేసి అమ్మేందుకు వారు 1994లోనే హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన ఎస్ఎస్ ఎస్టేట్స్అనే సంస్థ డైరెక్టర్ నూతక్కి నాగ కిషోర్ పేరిట జీపీఏ చేశారు. అప్పట్లోనే ప్లాట్లుగా చేసి అమ్మేశారు. నెలకు కొంత చెల్లించి వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు ఇక్కడ ప్లాట్లు కొనుగోలు చేశారు. ఇదంతా 24 ఏళ్ల క్రితమే పూర్తయింది. భూరికార్డుల ప్రక్షాళనలో ఈ భూమిని మళ్లీ సాగు భూములుగా మార్చి ఈశ్వరయ్య పేరిట పాస్ బుక్స్ జారీ చేశారు. రైతుబంధు కూడా ఇస్తుండగా.. ప్లాట్లు కొనుగోలు చేసిన వ్యక్తులు లబోదిబోమంటున్నారు.

పహాణీలో ఇండ్ల స్థలాలను ఎంట్రీ చేసినా..
కరీంనగర్ – హైదరాబాద్ హైవేలోని తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 666లో సుమారు 3 ఎకరాల్లో పదేళ్ల కిందట అనుమతుల్లేకుండా వెంచర్ చేశారు. 33 ప్లాట్లుగా చేసి పలువురికి అమ్మేశారు. కొనుగోలు చేసినవాళ్లకు పట్టాదారు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేశారు. ఇళ్ల స్థలాలుగా మారినా నాలా కన్వర్షన్ చేయలేదు. ఈ క్రమంలోనే 2017లో చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళనలో రెవెన్యూ అధికారులు ఆ భూమిని ఇళ్ల స్థలాలుగా చూపకుండా పాత యజమాని పేరిట పట్టాదారు పాస్ బుక్ జారీ చేశారు. దీంతో ఆయనకు రైతు బంధు కూడా మంజూరవుతోంది. 2017 – 18 పహాణీలో ఈ ఏరియాను ఇండ్ల స్థలాలుగా చూపినప్పటికీ.. పాస్ బుక్ జారీ కావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తిమ్మాపూర్ తహసీల్దార్ ఆఫీస్ పక్కనే వెలసిన శంకర్ హోమ్స్ అనే వెంచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కూడా పాస్ బుక్ జారీ చేశారు. రైతు బంధు ఇచ్చారు.

మార్చేందుకు ఆప్షన్ లేదు
ధరణిలో పాత పట్టాదారుల పేర్లే వస్తుండడంతో ప్లాట్లు కొనుగోలు చేసిన వ్యక్తులు తమ రిజిస్టర్డ్ డాక్యుమెంట్లతో తహసీల్దార్లను ఆశ్రయిస్తున్నారు. సదరు పట్టా రద్దు చేయాలని, తమ పేరిట మ్యుటేషన్ చేయాలని కోరుతున్నారు. కానీ గుంటల లెక్కన భూమి రిజిస్ట్రేషన్ అయి ఉంటే మాత్రమే మ్యుటేషన్ చేయడానికి వీలుందని, రిజిస్ట్రేషన్ చదరపు గజాల్లో జరిగినందువల్ల మ్యుటేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చాన్స్ లేదని తహసీల్దార్లు చేతులెత్తేస్తున్నారు. ఆ భూమిని నాలా కన్వర్షన్ చేసి పట్టా రద్దు చేయండని కోరితే అది కూడా తమ చేతుల్లో లేదంటున్నారు. ఒక వేళ నాలా కన్వర్షన్ చేయాలన్నా పట్టాదారు అప్లై చేసుకోవాలని, కన్వర్షన్ అయ్యాక కూడా పట్టాదారు పేరే రికార్డుల్లో కనిపిస్తుందని చెప్తున్నారు. పట్టా రద్దు చేసే అధికారం తమకు లేదని తిప్పిపంపుతున్నారు.