
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హనీమూన్ మర్డర్ కేసు ఇప్పుడు సినిమాగా రాబోతోంది. ఇందుకోసం బాధిత కుటుంబం దర్శకుడికి అనుమతి ఇచ్చింది. అసలేం జరిగిందో ప్రజలకు తెలియాలనే రాజా రఘువంశీ సోదరుడు సచిన్ మీడియాకు తెలిపాడు.
దర్శకుడు నింబావత్ సినిమా టైటిల్ ఖరారు చేశారు. "హనీమూన్ ఇన్ షిల్లాంగ్" (Honeymoon in Shillong) అనే టైటిల్ పెట్టారు. బాధితుడు రాజా కుటుంబ నేపథ్యం, వివాహం, హత్యకు దారి తీసిన పరిణామాలు, భార్య, ఆమె ప్రియుడు పన్నిన కుట్ర, అనంతరం పోలీసుల దర్యాప్తు, నిందితుల అరెస్ట్ కు దారి తీసిన పరి ణామాలు అన్నీ ఈ చిత్రంలో రూపుదిద్దుకోనున్నాయి. 80% షూటింగ్ ఇండోర్లోనే జరగనుంది.
రాజా సోదరుడు సచిన్ మాట్లాడుతూ...'సమాజానికి అర్థం కావడం కోసమే సినిమా తీసేందుకు అనుమతి ఇచ్చినట్లు చెప్పారు. ఈ సంఘటనలో ఎవరిది తప్పు.. ఎవరిది సరైందో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
మరో సోదరుడు విపస్ మాట్లాడుతూ ఈ చిత్రం ద్వారా నిజాన్ని చూపించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. దర్శకుడు నింబవత్ మాట్లాడుతూ సినిమా ద్వారా సమాజానికి ఒక హెచ్చరికగా ప్రజలకు సందేశం పంపించాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.
అసలేం జరిగింది?
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన బిజినెస్‌మెన్ రాజా రఘువంశీకి అదే సిటీకి చెందిన బిజినెస్‌మెన్ దేవీసింగ్ కుమార్తె సోనమ్‌తో వివాహం జరిగింది. ఆ తర్వాత రఘువంశీ, సోనమ్ మేఘాలయాకు హనీమూన్‌కు వెళ్లారు. స్కూటర్ రెంట్‌కు తీసుకుని మౌలఖియాట్ అనే ప్రాంతానికి చేరుకున్నారు. ఇక ఆ తర్వాత నుంచి కనిపించకుండాపోయారు.
ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కొత్త జంట జాడ కనిపెట్టేందుకు మేఘాలయా ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో 2025 జూన్ 2న ఓ జలపాతం దగ్గర లోయలో రాజా రఘువంశీ డెడ్‌బాడీ దొరికింది. అతని గోల్డ్ రింగ్, చైన్ మిస్ అయినట్టు పోలీసులు గుర్తించారు.
ఆ తర్వాత స్పాట్‌కు దగ్గర్లోనే రక్తపు మరకలు ఉన్న కత్తి, రెయిన్ కోట్ దొరికింది. రఘువంశీ హత్యకు గురైనట్టు భావించిన పోలీసులు.. ఆయన భార్య సోనమ్ కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి, ఘాజీపూర్ హైవేపై ఆమె ఉన్నట్టు సమాచారం రావడంతో యూపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రియుడు రాజ్ కుష్వాహాతో కలిసి కిరాయి గుండాలతో భర్తను తానే హత్య చేసినట్లు సోనమ్ పోలీసుల విచారణలో ఒప్పుకుంది.