
- నీలం మధు, నేతి విద్యాసాగర్, కపిలవాయి, ఆకుల లలిత, ఏనుగు రవీందర్ రెడ్డి, సంతోష్ కుమార్ కూడా
- పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన మల్లికార్జున ఖర్గే
న్యూఢిల్లీ, వెలుగు: కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, మాజీ ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, శాసన మండలి మాజీ ఉపాధ్యక్షుడు నేతి విద్యాసాగర్, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్, ఆకుల లలిత, కరీంనగర్ బీఆర్ఎస్ నేత సంతోష్ కుమార్, నీలం మధు ముదిరాజ్ కాంగ్రెస్ లో చేరారు. శుక్రవారం వీరంతా ఢిల్లీలోని ఏఐసీసీ హెడ్ ఆఫీసులో పార్టీ చీఫ్ ఖర్గే నేతృత్వంలో పార్టీ కండువా కప్పుకున్నారు. కార్యక్రమంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఇన్చార్జి మాణిక్ రావ్ ఠాక్రే, సీఎల్పీ నేత భట్టి, ఎంపీ కోమటి రెడ్డి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తాను తప్పు చేశానని, దాన్ని సరిదిద్దుకునేందుకే తిరిగి కాంగ్రెస్ లో చేరినట్లు తెలిపారు. బీజేపీలోకి వెళ్లినా, తిరిగి కాంగ్రెస్ చేరినా.. కేసీఆర్ ను గద్దె దించేందుకేనన్నారు. కేసీఆర్ అవినీతిపై బీజేపీ చర్యలు తీసుకుంటుందనే ఆ పార్టీలో చేరినట్లు చెప్పారు.
కానీ ఆ దిశగా చర్యలు లేనందునే ఆ పార్టీని వీడినట్లు చెప్పారు. హంగ్ వస్తే బీజేపీ, ఎంఐఎం ఎమ్మెల్యేలు బీఆర్ఎస్కు మద్దతు ఇస్తారని కామెంట్ చేశారు. కాంగ్రెస్ 70–80 స్థానాల్లో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ను ఓడించే సత్తా కేవలం కాంగ్రెస్ కే ఉందని మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ అన్నారు. పార్టీ చీఫ్గా బండి సంజయ్ తొలగింపు తర్వాత రాష్ట్రంలో బీజేపీ బలహీనపడిందన్నారు. తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందని ఆకుల లలిత అన్నారు. బీసీ మహిళగా నిజామాబాద్ అర్బన్ లో పోటీకి తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. నిజామాబాద్ లో కూడా కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.