చంద్రబాబుకు ఖైదీ 7691 నంబర్​ కేటాయింపు

చంద్రబాబుకు ఖైదీ 7691 నంబర్​  కేటాయింపు
  • ఏడున్నర గంటలు కొనసాగిన వాదనలు
  • ఏపీ అంతటా 144 సెక్షన్​ విధింపు

హైదరాబాద్, వెలుగు: టీడీపీ చీఫ్​, మాజీ సీఎం చంద్రబాబుకు రాజమండ్రి సెంటర్ జైల్లో ఖైదీ నంబర్ 7691 కేటాయించినట్లు తెలిపారు జైలు అధికారులు.  ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో  పోలీసులు రాజమండ్రి సెంట్రల్​ జైలుకు తరలించారు. జైల్లో ఆయనకు ప్రత్యేక వసతులు కల్పించారు. 

స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో శనివారం తెల్లవారుజామున ఏపీ సీఐడీ సిట్ అధికారులు  చంద్రబాబును అరెస్ట్ చేశారు.  శనివారం సాయంత్రం నుంచి ఆదివారం తెల్లవారుజామున 3 గంటల వరకు ప్రశ్నించారు.  స్టేట్​మెంట్ రికార్డ్ చేశారు. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో విజయవాడలోని ఏసీబీ జడ్జి ముందు హాజరుపరిచారు. చంద్రబాబును 37వ నిందితుడిగా పేర్కొంటూ మొత్తం 28 పేజీల రిమాండ్ రిపోర్టును కోర్టులో సమర్పించారు. చంద్రబాబు అరెస్ట్, రిమాండ్ రిపోర్ట్ పై సుదీర్ఘ వాదనలు జరిగాయి. సీఐడీ తరపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి, చంద్రబాబు తరపున సీనియర్ అడ్వకేట్​ సిద్ధార్థ్ లూత్రా వాదనలు వినిపించారు. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన వాదనలు మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగాయి. న్యాయసూత్రాలకు విరుద్ధంగా సీఐడీ అధికారులు వ్యవహరించారని కోర్టుకు లూత్రా తెలిపారు. 

సెంట్రల్ జైలుకు వద్దు: డిఫెన్స్ లాయర్లు

కోర్టు ఆదేశాలతో చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించేందుకు సీఐడీ అధికారులు ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు తరఫు అడ్వకేట్లు రాజమండ్రి సెంట్రల్ జైలుకు కాకుండా ఆయన హెల్త్ ను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవాలని కోరారు. హౌస్ అరెస్ట్​ లో ఉంచాలని, తప్పని పరిస్థితిలో రాజమండ్రి సెంట్రల్  జైలుకు తరలిస్తే ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలన్నారు. చంద్రబాబుకు ప్రాణహాని ఉందని, సెక్యూరిటీ పరమైన అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ఏసీబీ కోర్టు తీర్పుపై చంద్రబాబు తరఫు అడ్వకేట్లు ఏపీ హైకోర్టులో హౌస్ మోషన్ దాఖలు చేయనున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబుపై నమోదైన ఇతర కేసుల్లో కూడా ప్రిజన్ ట్రాన్సిట్(పీటీ) వారెంట్స్ ను అమలు చేసేందుకు ఏపీ పోలీసులు చర్యలు ప్రారంభించినట్లు తెలిసింది. ఇదే జరిగితే చంద్రబాబుకు బెయిల్ రావడం కూడా కష్టమయ్యే అవకాశం ఉంది. కాగా, జైల్లో చంద్రబాబుకు ఖైదీ 7691 నంబర్​ను కేటాయించారు. 

ఏడున్నర గంటల వాదనలు 

సెక్షన్ 409 ఐపీసీ, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అమలు చేయడంపై చంద్రబాబు తరఫు అడ్వకేట్​ లూథ్ర అభ్యంతరం తెలిపారు. వీటిపైనే మొత్తం ఏడున్నర గంటల పాటు సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఇరువర్గాల వాదనలు విన్న జడ్జి.. సాయంత్రం 6.45 గంటలకు తీర్పు వెల్లడించారు. రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న వివరాలు, సీఐడీ అందించిన ఆధారాలను పరిశీలించారు. సీఐడీ వాదనలకు ఏకీభవిస్తూ చంద్రబాబుకు ఈ నెల 22 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో చంద్రబాబు తరఫు అడ్వకేట్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్​పై సోమవారం విచారణ జరుగనుంది.

ఏపీ అంతటా 144 సెక్షన్​

చంద్రబాబుకు జ్యుడీషియల్ రిమాండ్ విధించినందున ఆంధప్రదేశ్​లో ప్రతి మండలంలో 144 సెక్షన్ అమలు చేయాలంటూ అక్కడి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనుమతి లేకుండా ఎలాంటి ర్యాలీలు, సభలు నిర్వహించడానికి వీల్లేదని చెప్పింది. .