గద్వాల, వెలుగు: రజకులపై దాడి చేసి రెండు నెలల పసికందును చంపిన నిందితులపై మర్డర్ కేసు పెట్టేంత వరకు పోరాటం చేస్తామని జిల్లా రజక సంఘం అధ్యక్షుడు రజక నర్సింహులు, ప్రజా సంఘాల నాయకులు తెలిపారు. సోమవారం కలెక్టరేట్ ముట్టడించి బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ నెల 18న మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా రజక కుటుంబంపై దాడి చేసి, రెండు నెలల పాప ప్రాణాలు తీశారన్నారు.
నిందితులపై కేసు నమోదు చేయకపోవడం సరైంది కాదని, నిందితులకు పోలీసులు సపోర్ట్ చేస్తున్నారని విమర్శించారు. నిందితులపై మర్డర్ కేసు పెట్టి బాధితులకు న్యాయం చేయాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. అనంతరం కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు. మాజీ కౌన్సిలర్ రజక జయశ్రీ, లత, రామకృష్ణ పాల్గొన్నారు.
వంగూరు: నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మరంపల్లి గ్రామానికి చెందిన చిన్నారి మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని సీఐటీయూ మండల నాయకులు బాలస్వామి డిమాండ్ చేశారు. మండలకేంద్రంలోని బ్యాంక్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ.. రజక కుటుంబంపై దాడి చేసి రెండు నెలల చిన్నారి మృతికి కారకులైన అగ్ర వర్ణ పెత్తందారులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. రజక సంఘం అధ్యక్షుడు గుడ్లనర్వ సుమన్, సాయిలు, జువ్వ కృష్ణయ్య, ఎల్లా గౌడ్, సైదులు, దశరథం, శివ, మురళి, రాజన్న, గెలువయ్య, బాలయ్య పాల్గొన్నారు.
కోస్గి: చిన్నారి మృతికి కారకులైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని మండల రజక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం రజక సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని శివాజీ చౌక్‌లో నిరసన తెలిపారు. ఆలయానికి వంద రూపాయలు ఇచ్చి వెళ్లాలని, డబ్బులు ఇవ్వకుంటే ప్రవేశం లేదని అడ్డు చెప్పడం సరైంది కాదన్నారు. పసిపాపను కాళ్లతో తన్ని చంపిన వారిని అరెస్టు చేయాలన్నారు. ఎల్లప్ప, నారాయణ, బసవరాజు, శేఖర్, లక్ష్మయ్య, రఘు, శ్రీను పాల్గొన్నారు.
