లింగాల, వెలుగు: నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలం చెన్నంపల్లి గ్రామ సమీపంలో గొర్రెల కాపరిపై చిరుత దాడి చేయడం కలకలం రేగింది. పానగల్ మండలం జమ్మాపూర్ గ్రామానికి చెందిన వీరయ్య చెన్నంపల్లి గ్రామ సమీపంలో గొర్రెలను మేపుతూ మంగళవారం రాత్రి అక్కడే ఉన్నాడు. అడవిలో నుంచి వచ్చిన చిరుత పులి గొర్రెల మందపై దాడి చేయడంతో పాటు కాపరి వీరయ్యపై కూడా దాడి చేసింది.
ఈ ఘటనలో అతనికి తల, కడుపులో గాయాలయ్యాయి. కాపరి గట్టిగా అరవడంతో చిరుత అక్కడి నుంచి వెళ్లిపోయింది. గాయపడిన వీరయ్యను గ్రామస్తులు వెంటనే లింగాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉంది. ఈ ఘటనతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. చిరుతను ఇక్కడి నుంచి తరలించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

