ఇక భీమేశ్వరాలయంలో రాజన్న దర్శనాలు... ఆర్జిత సేవలు, కోడె మొక్కులు, అభిషేకాలు

ఇక భీమేశ్వరాలయంలో రాజన్న దర్శనాలు... ఆర్జిత సేవలు, కోడె మొక్కులు, అభిషేకాలు
  • రాజన్న ఆలయంలో నిత్య కైంకర్యాలు యథాతథం
  • పల్లకీ సేవ ద్వారా భీమేశ్వరాలయానికి ఉత్సవ మూర్తులు 
  • ఆలయ అభివృద్ధి పనుల నేపథ్యంలో నిర్ణయం

తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వరస్వామి క్షేత్రం అభివృద్ధి పనులపై రాష్ట్ర సర్కార్​ కార్యాచరణ స్పీడప్​ చేసింది. పనుల్లో భాగంగా ఎములాడ రాజన్న దర్శనానికి అధికారులు తాత్కాలికంగా భీమేశ్వరాలయంలో ఏర్పాట్లు చేశారు. ఆలయ విస్తరణ, రోడ్డు వెడల్పు పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. శనివారం పల్లకీ సేవ ద్వారా రాజన్న ఆలయంలోని ఉత్సవమూర్తులను భీమేశ్వరాలయానికి తీసుకెళ్లారు. డెవలప్​మెంట్​ పనులు పూర్తయ్యే వరకు రాజన్న దర్శనం ఇక్కడే దక్కనుంది.

వేములవాడ, వెలుగు: వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయ అభివృద్ధి విస్తరణకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా రాజన్న దర్శనానికి అధికారులు ప్రత్యామ్నాయంగా భీమేశ్వరాలయంలో ఏర్పాట్లు చేశారు. మొక్కులు, దర్శనాలు, ఆర్జిత సేవలు, కోడె మొక్కు, అభిషేకాలు, అన్నపూజ, కుంకుమపూజ, నిత్యకల్యాణం, చండీహోమం ఇక్కడే ఉంటాయని ఆలయ అధికారులు ప్రకటించారు. 

శనివారం రాజన్న ఆలయంలోని ఉత్సవమూర్తులను పల్లకీ సేవ ద్వారా భీమేశ్వర ఆలయానికి తీసుకెళ్లారు. ఆలయ అద్దాల మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, మేళతాళాలు, భక్తజన సందోహం మధ్య పార్వతీ రాజరాజేశ్వరస్వామి, అనంతపద్మనాభ స్వామి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా భీమేశ్వరాలయానికి తరలించారు. ఈ వేడుకకు ప్రభుత్వ విప్​ ఆది శ్రీనివాస్​ గెస్ట్​గా హాజరయ్యారు. భీమేశ్వర స్వామి ఆలయంలో ఆయన ఆర్జిత సేవలతో పాటు కోడె మొక్కు, నిత్య కల్యాణం ప్రారంభించారు. 

రూ.76 కోట్లతో ఆలయ విస్తరణ..

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్​రెడ్డి గతేడాది నవంబర్​ 20న శంకుస్థాపన చేశారు. తొలి విడతలో రూ.76 కోట్ల నిధులు మంజూరు చేయగా పనులు జరుగుతున్నాయి. అలాగే మూలవాగు బ్రిడ్జి నుంచి రాజన్న ఆలయం వరకు రూ.42 కోట్ల నిధులతో 80 ఫీట్ల రోడ్డు వెడల్పు పనులు చేపడుతున్నారు. వేములవాడ పట్టణాన్ని టెంపుల్ సిటీగా డెవలప్​ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

శృంగేరి పీఠాధిపతుల సూచనలతో..

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి విషయంలో శృంగేరి పీఠాధిపతుల సలహాలు, సూచనలతో ముందుకు వెళ్తున్నట్లు ప్రభుత్వ విప్​ ఆది శ్రీనివాస్​తెలిపారు. ఈ నెల19న  శృంగేరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విధిశేఖర భారతి శర్మ వేములవాడ రాజన్న ఆలయాన్ని సందర్శిస్తారన్నారు. 

మరో వందేళ్లు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు  తలెత్తకుండా రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు. పల్లకీ సేవ కార్యక్రమంలో  ఈవో రమాదేవి, ఆలయ పరిరక్షణ సమితి సభ్యుడు ప్రతాప రామకృష్ణ, మార్కెట్​ కమిటీ చైర్మన్​ రొండి రాజు, చంద్రగిరి శ్రీనివాస్​గౌడ్, ఆది కార్తీక్  పాల్గొన్నారు.