వాట్ ఏ ఐడియా.. లేడీ గెటప్లో చోరీకి పాల్పడిన యువకుడు

వాట్ ఏ ఐడియా.. లేడీ గెటప్లో చోరీకి పాల్పడిన యువకుడు

దొంగలు పోలీసులకు దొరకుండా వింత వింత ప్రయోగాలు చేస్తుంటారు. పోలీసుల ఊహకు అందకుండా ఎత్తులకు పై ఎత్తులు వేస్తుంటారు. నానా అవస్థలు పడి దొంగతనాలకు పాల్పడుతుంటారు. కానీ ఎన్ని వేషాలు వేసిన చివరకు పోలీసులకు దొరికిపోతుంటారు. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ యువకుడు పోలీసులకు దొరకుండా ఉండేందుకు లేడీ గెటప్ వేసి.. తన ఇంట్లో కిరాయికి ఉంటున్న ఫ్లెక్సీ ప్రింటింగ్ షాపులో దొంగతనం చేశాడు. చివరికి 48 గంటల్లోనే పోలీసులకు దొరికిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని సింగారం గ్రామంలో గనగోని బంటి లక్ష్మీనారాయణ అనే వ్యక్తి ఫ్లెక్సీ ప్రింటింగ్ దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. సెప్టెంబర్ 9వ తేదీన రాత్రి సమయంలో లక్ష్మీ నారాయణ దుకాణానికి తాళం వేసి ఇంటికి వెళ్లాడు. సెప్టెంబర్ 11వ తేదీన ఉదయం దుకాణానికి వచ్చి చూడగా.. వెనుక ఉన్న తలుపు తీసినట్లు కనిపించింది. దీంతో వెంటనే కౌంటర్ తెరిచి చూడగా.. అందులో ఉన్న రూ.3500 నగదు అపహరణకు గురైందని గమనించాడు. స్థానిక పోలీసులకు లక్ష్మీనారాయణ ఫిర్యాదు చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. 

సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాలను పరిశీలించారు. చోరీకి పాల్పడింది యువతి అని పోలీసులు భావించారు. తర్వాత  అనుమానం వచ్చిన పోలీసులు చోరీకి పాల్పడిన వ్యక్తి యువకుడిగా గుర్తించారు. అందులో ఉన్న దృశ్యాల ఆధారంగా ..చోరీ చేసింది షాపు బిల్డింగ్ ఓనర్  రామిండ్ల సుధీర్ గా పోలీసులు తేల్చారు. 

 

Also read :- ఎయిర్ పోర్టులో ఫారిన్ కరెన్సీ పట్టివేత

 జల్సాలకు అలవాటు పడిన సుధీర్ ..డబ్బుల కోసం తన బిల్డింగ్ లోని ఫ్లెక్సీ ప్రింటింగ్ దుకాణంలో చోరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే లేడీ గెటప్ లో చోరీకి పాల్పడితే దొరకడని భావించిన అతను..తన భార్యకు సంబంధించిన సవరంతో పాటు దుస్తులు ధరించి ఈ  దొంగతనానికి పాల్పడ్డానని చెప్పారు.  సుధీర్ పై కేసు నమోదు చేసిన పోలీసులు.. రిమాండ్ కు తరలించారు.