ప్రతి ఖర్చును లెక్కలో చూపాలి : రాజర్షి షా

ప్రతి ఖర్చును లెక్కలో చూపాలి : రాజర్షి షా

మెదక్​, వెలుగు: ఎన్నికల్లో పోటీచేసే ప్రతి అభ్యర్థి రోజూవారీ ఖర్చుల వివరాలు రిజిస్టర్​లో నమోదు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్  రాజర్షి షా  రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. గురువారం  కలెక్టరేట్ లో అడిషనల్​ కలెక్టర్లు  రమేశ్ , వెంకటేశ్వర్లు తో కలిసి  సమావేశం  నిర్వహించారు .  ఈ  సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభ్యర్థులు ప్రతి ఖర్చును లెక్కలో చూపాలన్నారు. సభలు, ర్యాలీలు, సమావేశాలకు ముందస్తుగా పోలీసుల అనుమతి పొందాలన్నారు. ప్రకటనలు, కరపత్రాలు, పోస్టర్ల ముద్రణకు, వాహనాల వినియోగానికి అనుమతి పొందాలన్నారు. 

అభ్యర్థి నామినేషన్ సందర్భంగా దాఖలు చేసే ఫామ్​ 26 అఫిడవిట్ లో  తప్పని సరిగా అన్ని అంశాలు పూరించాలని స్పష్టం  చేశారు. అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, రేడియో లలో ప్రకటనలకు సంబంధించి సమాచార శాఖ నిర్ధారించిన రేట్ కార్డులను వారికి అందజేశారు. సమావేశంలో పలు రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. 

ఈవీఎం గోడౌన్ ను పరిశీలించిన కలెక్టర్

   
నెలవారీ తనిఖీల్లో భాగంగా కలెక్టర్ రాజర్షి షాఈవీఎం గోడౌన్ ను తనిఖీ చేశారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, ఎన్నికల సామగ్రిని భద్రపరిచిన గదులను పరిశీలించారు. ఈవీఎంలు, బ్యాలెట్ యంత్రాల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, అగ్నిమాపక సామగ్రి, ఇతర పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఆయన వెంట  అడిషనల్​ కలెక్టర్  వెంకటేశ్వర్లు, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు హర్దీప్ సింగ్ ఉన్నారు.