దారిపొడవునా మంచు గుట్టలు... వణుకు పుట్టించే చల్లని గాలులు... అలాంటి సిచ్యుయేషన్‌లో అడుగు బయటపెట్టాలంటేనే భయమేస్తుంది. కానీ, వీళ్లు అంతటి చలిని సైతం లెక్కచేయకుండా డ్యూటీ చేస్తున్నారు. మంచు పరుచుకున్న ఇరుకు దారుల గుండా నడుచుకుంటూ వెళ్లి, మారుమూల ఊళ్లలోని ప్రజలకి వ్యాక్సిన్ వేస్తున్నారు. వీళ్లంతా కాశ్మీర్‌లోని బడ్గాం జిల్లాలోని హెల్త్‌వర్కర్లు. వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో భాగంగా ఇంటింటికి వెళ్లి వ్యాక్సిన్ వేస్తున్నారు. చేతిలో వ్యాక్సిన్ డబ్బాలు పట్టుకుని మంచు తోవలో వెళ్తున్న వీళ్ల ఫొటోలు నెట్లో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూసిన వాళ్లంతా ఈ నర్సమ్మల డెడికేషన్‌కి హ్యాట్సాఫ్ చెబుతున్నారు....
పెయింటింగ్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. ఆ ఇష్టమే రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌కి చెందిన రవిసోనికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ తెచ్చిపెట్టింది. ఈ మధ్య బాస్కెట్ బాల్ గ్రౌండ్ నిండా ఒక పెద్ద పెయింటింగ్ వేశాడు. కష్టసమయంలో ధైర్యంగా ఉండాలని చెప్పేందుకు వేశాడట. ఈ పెయింటింగ్ కోసం ఆఫ్రికాలో ఎక్కువగా పెరిగే ‘బవుబాబ్’ చెట్టును థీమ్‌గా తీసుకున్నాడు.
‘ట్రీ ఆఫ్ లైఫ్’ పేరుతో అతను గీసిన ఈ భారీ పెయింటింగ్ రవికి గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కేలా చేసింది. ‘మెంటల్ స్ట్రెంత్’ గురించి అవేర్నెస్ కల్పించాలనే ఈ పెయింటింగ్ వేశాను’ అంటున్న రవి రంగుల ప్రపంచంలోకి వెళ్తే...
ఉదయ్‌పూర్‌లోని మహారాణా భూపాల్ బాస్కెట్‌బాల్ స్టేడియంలో 6,781 చదరపు అడుగుల పెయింటింగ్ వేశాడు రవి. ఐదు రోజుల్లో 24 గంటలు కష్టపడి ఈ పెయింటింగ్ కంప్లీట్ చేశాడు. ప్రపంచంలో ఒక వ్యక్తి గీసిన అతి పెద్ద పెయింటింగ్ ఇదే. ఇంతకు ముందు ఈ రికార్డు ఇటలీకి చెందిన డూడుల్ ఆర్టిస్ట్ ఫ్రాన్సెస్కో కపోరలే పేరు మీద ఉంది. అన్ని గంటలు పెయింటింగ్ వేసేందుకు రవి మానసికంగా, శారీరకంగా ప్రిపేర్ అయ్యాడు. అలసిపోకుండా ఉండేందుకు ధ్యానం చేశాడు. సంగీతం విన్నాడు.
చెట్టు థీమ్ ఆలోచన
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో చదివాడు రవి. తర్వాత ముంబైలో జాబ్‌వచ్చింది. ‘ఫ్యూచర్ గ్రూప్’, అరవింద్ లిమిటెడ్, రిలయన్స్ రిటైల్ కంపెనీల్లో దాదాపు 20 ఏండ్లు పనిచేశాడు. కరోనా ఫస్ట్‌వేవ్ టైమ్‌లో వర్క్‌ఫ్రమ్ హోమ్ ఇవ్వడంతో సొంతూరు వచ్చాడు. కరోనా నెగెటివ్ న్యూస్ వల్ల చాలామంది మానసికంగా ఒత్తిడికి లోనవ్వడం చూసి, అందరిలో పాజిటివ్ ఆలోచనలు నింపాలి అనుకున్నాడు. సెకండ్‌వేవ్‌లో చాలామందికి ఆక్సిజన్ సిలిండర్ల అవసరం పడింది. అప్పుడే రవికి నీళ్లు తక్కువ ఉండే నేలలో కూడా ఎక్కువ రోజులు బతికే ‘బవుబాబ్’ చెట్టు గుర్తుకు వచ్చింది. కష్టమైన పరిస్థితుల్లో బతుకు మీద ఆశ వదిలేయొద్దని చెప్పడానికి ‘బవుబాబ్’ చెట్టు స్ఫూర్తితో ‘ట్రీ ఆఫ్ లైఫ్’ థీమ్ తీసుకున్నాడు. మొదట్లో ఎ4 పేపర్ మీద స్కెచ్ వేసి, తర్వాత బాస్కెట్‌బాల్ గ్రౌండ్ మొత్తం పరిచిన పివిసి (పాలీవినైల్ క్లోరైడ్) కాన్వాస్ మీద ఈ పెయింటింగ్ వేశాడు.
ఆలోచనల్లోనే అంతా
‘‘కరోనా ప్యాండెమిక్ కారణంగా చాలామంది ప్రొఫెషనల్, పర్సనల్ లైఫ్ మారిపోయింది. మానసికంగా, ఆర్థికంగా దెబ్బతిన్నారు కొందరు. ఆత్మీయుల్ని కోల్పోయారు మరికొందరు. జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు గెలుస్తామో!, ఓడిపోతామో! అనేది ముందుగానే మన మెదడులో తేలిపోతుంది. మొదట్లోనే ఆపేస్తామా! లేదంటే ధైర్యంగా అడుగు వేస్తామా! అనేది మన మెదడు ఆలోచనల్లోనే ఉంటుందని నేను గట్టిగా నమ్ముతాను. అందుకే, పాజిటివ్‌గా ఆలోచించాలి. అప్పుడే ఏదైనా సాధించగలం” అంటున్నాడు ఈ ఆర్టిస్ట్.
