గెహ్లాట్.. ఇక రెస్ట్ తీసుకో.. రాజస్థాన్ సీఎంపై మోదీ ఫైర్

గెహ్లాట్.. ఇక రెస్ట్ తీసుకో.. రాజస్థాన్ సీఎంపై  మోదీ ఫైర్
  • అంతా మేం చూస్కుంటం
  •  
  •     కాంగ్రెస్ ఓటు బ్యాంకునే ప్రేమిస్తుందని విమర్శ
  •     రాజస్థాన్ లో ప్రధాని పర్యటన

జోధ్ పూర్: కాంగ్రెస్ ఎప్పుడూ అధికారం కోసమే చూస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. ‘‘కాంగ్రెస్ అటు రైతులను గానీ, ఇటు సైనికులను గానీ పట్టించుకోలేదు. ఆ పార్టీ ప్రజా ప్రయోజనాల కంటే ఓటు బ్యాంకునే ఎక్కువగా ప్రేమిస్తుంది” అని కామెంట్ చేశారు. గురువారం రాజస్థాన్ లో మోదీ పర్యటించారు. రూ.5 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులు ప్రారంభించారు. అనంతరం జోధ్ పూర్ లో నిర్వహించిన ర్యాలీలో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం అశోక్ గెహ్లాట్ పై విమర్శలు చేశారు. ‘‘ఇయ్యాల జరిగిన ప్రభుత్వ కార్యక్రమానికి సీఎం హాజరుకాలేదు. ఎందుకంటే ఆయనకు నా మీద నమ్మకం ఉంది. నేను వస్తే పనులన్నీ జరిగిపోతాయని తెలుసు. ఈ సందర్భంగా నేను ఆయనకు ఒకటి చెబుతున్నా. ఇక మీరు రెస్ట్ తీసుకోండి.. మేము అంతా చూసుకుంటాం” అని గెహ్లాట్ ను ఉద్దేశించి అన్నారు. బీజేపీని గెలిపిస్తే రాజస్థాన్ ను టూరిజంలో నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని మోదీ హామీ ఇచ్చారు.

‘‘ఇది సాధ్యం కావాలంటే  అంతా మీ చేతుల్లోనే ఉంది. మీరు ఓటేస్తే బీజేపీ అధికారంలోకి వస్తుంది. అప్పుడు రాజస్థాన్ టూరిజంలో నంబర్ వన్ అవుతుంది” అని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో రాజస్థాన్ లో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందని, దళితులు, మహిళలపై దాడులు పెరిగాయన్నారు. ‘‘అశోక్ గెహ్లాట్ సర్కార్ పాలన మొత్తం అవినీతిమయమే. ఆ అవినీతి చిట్టా అంతా రెడ్ డైరీలో ఉంది. మేం అధికారంలోకి వస్తే అదంతా బయటపెడతాం” అని ప్రధాని చెప్పారు. రాష్ట్రంలోని పేపర్ లీక్ మాఫియా కారణంగా లక్షలాది మంది యువత భవిష్యత్తు నాశమైందన్నారు.