2 రోజులు, 25 కుక్కలు.. కనిపించిన చోటే కాల్చి చంపాడు.. గ్రామస్తుల ఆగ్రహం...

 2 రోజులు, 25 కుక్కలు.. కనిపించిన చోటే కాల్చి చంపాడు.. గ్రామస్తుల ఆగ్రహం...

రాజస్థాన్‌లోని ఝుంఝును జిల్లాలో ఓ ఘోరం వెలుగు చూసింది. కేవలం రెండు రోజుల్లో 25కు పైగా కుక్కలను కాల్చి చంపిన దారుణ ఘటన కలకలం సృష్టించింది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

దుమ్రా గ్రామానికి చెందిన షియోచంద్ బవేరియా అనే వ్యక్తి వీధుల్లో తిరుగుతూ కనిపించిన కుక్కలను కాల్చి చంపుతున్నట్లు ఓ వీడియో వైరల్ అయింది. ఈ వీడియోలో కుక్కలు రక్తం మరకలతో గ్రామ వీధుల్లో, పొలాల్లో ఎక్కడ పడితే అక్కడ పడి ఉండటం కనిపిస్తుంటుంది. భయంతో ప్రాణాల కోసం పారిపోతున్న కుక్కలను కూడా అతను వదల్లేదని కొందరు గ్రామస్తులు చెబుతున్నారు.

ALSO READ : ఎంత పనిచేసావ్ బాస్

ఈ వీడియోలో బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు రైఫిల్‌ గన్ తో కుక్కలను చంపడం, మూడో వ్యక్తి  ఇదంతా రికార్డ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆగస్టు 4న పోలీసులు నిందితుడు బవేరియాపై భారత శిక్షాస్మృతి, ఆయుధ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. జంతు ప్రేమికులు, గ్రామస్తులు ఈ దారుణమైన చర్యను తీవ్రంగా ఖండిస్తూ, నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.    .

ప్రస్తుతం బవేరియా పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో అతనికి ఇంకెవరైనా సహాయం చేసారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయంపై జంతు సంక్షేమ సంఘాలు, ఇతర ప్రముఖులు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.