
జైపూర్: వరుసగా రెండు ఓటముల తర్వాత ఐపీఎల్16లో రాజస్తాన్ రాయల్స్ అదిరిపోయే విక్టరీతో టాప్ ప్లేస్‌లోకి దూసుకొచ్చింది. బ్యాటింగ్‌లో యంగ్‌స్టర్ యశస్వి జైస్వాల్ (43 బాల్స్‌లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 77), బౌలింగ్‌లో స్పిన్నర్లు ఆడం జంపా (3/22), రవిచంద్రన్ అశ్విన్ (2/35) మ్యాజిక్ చూపెట్టడంతో సొంతగడ్డపై గురువారం జరిగిన మ్యాచ్‌లో 32 రన్స్ తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌పై ఘన విజయం సాధించింది. మొదట రాజస్తాన్ 20 ఓవర్లలో 202/5 స్కోరు చేసింది. జైస్వాల్‌కు తోడు ధ్రువ్ జురెల్ (15 బాల్స్‌లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 34), దేవదత్ పడిక్కల్ (13 బాల్స్‌లో 5 ఫోర్లతో 27 నాటౌట్) రాణించారు. సీఎస్కే బౌలర్లలో తుషార్ దేశ్ పాండే రెండు, జడేజా, తీక్షణ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఛేజింగ్‌లో సీఎస్కే 170/6 స్కోరుకే పరిమితం అయింది. శివం దూబే (33 బాల్స్‌లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 52), రుతురాజ్ గైక్వాడ్ (29 బాల్స్‌లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 47) పోరాడినా ఫలితం లేకపోయింది. యశస్వికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
జైస్వాల్ హల్‌చల్
రాజస్తాన్ ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ ఆటే హైలైట్. టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన రాయల్స్‌కు మరో ఓపెనర్ జోస్ బట్లర్ (27)తో అద్భుత ఆరంభం ఇచ్చి భారీ స్కోరుకు బాటలు వేశాడు. స్టార్టింగ్ నుంచే దూకుడుగా ఆడిన అతను అన్నిరకాల షాట్లతో బౌండ్రీలు కొట్టాడు. ఆకాశ్ సింగ్ ను టార్గెట్ చేసిన యంగ్ ఓపెనర్.. తొలి ఓవర్లోనే మూడు ఫోర్లతో తన ఉద్దేశం ఏంటో చెప్పాడు. రెండో ఓవర్లో దేశ్‌పాండేకు బట్లర్ రెండు ఫోర్లతో వెల్‌కం చెప్పగా.. ఆకాశ్ బౌలింగ్‌లో జైస్వాల్ మరో మూడు ఫోర్లు, లాంగాన్ మీదుగా సిక్సర్‌తో 18 రన్స్ పిండుకున్నాడు. ఆపై తుషార్, జడేజా ఓవర్లలోనూ రెండు సిక్సర్లు రాబట్టిన జైస్వాల్ 26 బాల్స్‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. అటు బట్లర్ కూడా బౌండ్రీలతో జోరు మీద కనిపించాడు. కానీ, తొమ్మిదో ఓవర్లో అతడిని ఔట్ చేసిన జడేజా తొలి వికెట్‌కు 86 రన్స్ పార్ట్‌నర్‌షిప్ బ్రేక్ చేశాడు. ఆ తర్వాత సీఎస్కే బౌలర్లు పరుగులు నియంత్రించారు. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ శాంసన్ (17) స్పిన్నర్ల బౌలింగ్‌లో తడబడ్డాడు. అయినా యశస్వి జోరు కొనసాగడంతో 13 ఓవర్లకు రాయల్స్ 125/1తో నిలిచింది. కానీ, తర్వాతి ఓవర్లో తుషార్.. ఈ ఇద్దరినీ పెవిలియన్ చేర్చి దెబ్బకొట్టాడు. కాసేపటికే హెట్‌మయర్ (8)ను తీక్షణ ఔట్ చేయగా.. 17 ఓవర్లకు రాయల్స్ 153/4తో కాస్త డీలా పడింది. అయితే, చివర్లో జురెల్, పడిక్కల్ ధనాధన్ బ్యాటింగ్‌తో చెలరేగారు. ఈ ఇద్దరి జోరుకు ఆఖరి మూడు ఓవర్లలో 49 రన్స్ రావడంతో రాయల్స్ స్కోరు 200 దాటింది.
చెన్నై డీలా
భారీ టార్గెట్ ఛేజింగ్‌లో చెన్నై ఏ దశలోనూ విజయానికి చేరువగా రాలేకపోయింది. ఇన్నింగ్స్‌ను నింపాదిగా ఆరంభించిన ఓపెనర్లు కాన్వే (16 బాల్స్‌లో 8), రుతురాజ్ తొలి మూడు ఓవర్లలో ఒకే ఫోర్‌తో సరిపెట్టారు. హోల్డర్ వేసిన నాలుగో ఓవర్లో 4, 6తో రుతురాజ్ స్పీడు పెంచే ప్రయత్నం చేయగా.. స్టయిల్ భిన్నంగా డిఫెన్స్ ఆడిన కాన్వేను ఆరో ఓవర్లో స్పిన్నర్ జంపా ఔట్ చేశాడు. దాంతో, పవర్ ప్లేలో42/1తో నిలిచిన సీఎస్కే తర్వాత స్పిన్నర్లు అశ్విన్, జంపా దెబ్బకు మరింత స్లో అయింది. ఫిఫ్టీకి చేరువైన గైక్వాడ్.. జంపా బౌలింగ్‌లో మరో భారీ షాట్‌కు ట్రై చేసి పడిక్కల్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఆ వెంటనే అశ్విన్ మూడు బాల్స్ తేడాతో ఫామ్‌లో ఉన్న రహానె (15), రాయుడు (0)ను ఔట్ చేసి చెన్నైని కోలుకోలేని దెబ్బ కొట్టాడు. దాంతో, 73/4తో ధోనీసేన ఎదురీత మొదలు పెట్టింది. ఈ దశలో శివం దూబేకు తోడైన మొయిన్ అలీ (23) వెంటవెంటనే రెండు సిక్సర్లు, ఓ ఫోర్‌తో ఇన్నింగ్స్‌కు చలనం తెచ్చాడు. అశ్విన్ వేసిన 14వ ఓవర్లో దూబే వరుసగా రెండు భారీ సిక్సర్లు కొట్టడంతో చెన్నై శిబిరంలో ఆశలు చిగురించాయి. జంపా వేసిన 15వ ఓవర్లోనూ దూబే మరో భారీ సిక్స్ కొట్టగా.. అలీ కీపర్‌కు క్యాచ్ ఇవ్వడంతో చెన్నై ఓటమి ఖాయమైంది. చివర్లో దూబేకు తోడైన జడేజా (23 నాటౌట్) పోరాడినా ఫలితం లేకపోయింది.