ఎక్కువ పాడినోళ్లకే ఫ్లాట్..రాజీవ్ స్వగృహలో అధికారుల కొత్త ప్లాన్

ఎక్కువ పాడినోళ్లకే ఫ్లాట్..రాజీవ్ స్వగృహలో అధికారుల కొత్త ప్లాన్
  • లాటరీ తీసి ఫ్లాట్ కేటాయించే విధానానికి స్వస్తి   
  • వేలంలో ఎక్కువ ధర పెట్టేవాళ్లకే ఫ్లాట్ ఇవ్వాలని నిర్ణయం 
  • ఈ నెల 26 నుంచి 924 ఫ్లాట్స్ వేలం

హైదరాబాద్, వెలుగు:  రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల అమ్మకానికి అధికారులు కొత్త నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు టోకెన్ అమౌంట్ కట్టిన వారి పేర్లను లాటరీలో తీసి ఫ్లాట్ కేటాయిస్తుండగా ఇపుడు వేలం పాట నిర్వహిస్తున్నారు. ఫ్లాట్ విస్తీర్ణంలో ఒక ఎస్ఎఫ్ టీకి ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఎవరు ఎక్కువ పాడితే వారికే ఫ్లాట్ ను కేటాయించనున్నారు. బండ్లగూడ, పోచారంలో త్రిబుల్ డీలక్స్, 3, 2, 1 బీహెచ్ కే ఫ్లాట్లు మొత్తం 924 ఉన్నాయి. ఇందులో బండ్లగూడలో 261, పోచారంలో 663 ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయి. వీటికి ఈ నెల 26 నుంచి వచ్చే నెల 7 వరకు ఆ ప్రాంతాల్లో వేలం పాట నిర్వహించనున్నారు.    
 
6వ సారి వేలం 

ఉమ్మడి రాష్ర్టంలో నిర్మించిన రాజీవ్ స్వగృహ అపార్ట్ మెంట్లను హెచ్ఎండీఏ లాటరీ ద్వారా వేలం వేస్తోంది. తొలిసారి నిర్వహించిన వేలంలో 3 వేల ప్లాట్లకు 39 వేల మంది పోటీ పడ్డారు. టోకెన్ అమౌంట్ కట్టిన వారి పేర్లతో లాటరీ తీసి, 3 వేల మందికి ఫ్లాట్స్ కేటాయించారు. మార్కెట్ రేట్ తో పోలిస్తే ఈ ఫ్లాట్లు చాలా తక్కువ ధర ఉండటంతో పబ్లిక్ పోటీ పడ్డారు. అయితే పార్కింగ్, వాటర్ బిల్లులు ఇతర సమస్యలు ఉండటంతో తరువాతి నుంచి పబ్లిక్ ఆసక్తి చూపటం లేదు. ఈ రెండు ప్రాంతాల్లో ఫ్లాట్ల అమ్మకానికి ఇది 6వ సారి వేలం నిర్వహిస్తున్నారు. అయితే, ఎవరు ఎక్కువ ధర పాడితే వారికే ఫ్లాట్ కేటాయించాలని హౌసింగ్ అధికారులు మొదట్లోనే ప్రతిపాదించారు. కానీ ప్రభుత్వం దీనికి అంగీకరించలేదు. మంచిగా ఉన్న ఫ్లాట్స్ అమ్ముడుపోయి మిగతావి మిగిలిపోతాయని అప్పట్లో వెనక్కి తగ్గారు. అయినా    ఫ్లాట్లు అమ్ముడు పోకపోవటంతో మళ్లీ వేలం     నిర్వహిస్తున్నారు. .

బండ్లగూడ ఫ్లాట్లకే డిమాండ్ 

బండ్లగూడలోని రాజీవ్ స్వగృహ ఫ్లాట్లకే పబ్లిక్ ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. నాగోల్ మెట్రోకు, సిటీకి చాలా దగ్గరగా ఉండటం, అక్కడ మార్కెట్ ధరతో పోలిస్తే రాజీవ్ స్వగృహ రేటు తక్కువ ఉండటంతో జనం ఇంట్రెస్ట్ చూపించారు.        బండ్లగూడలో 3 బీహెచ్ కే డీలక్స్, 3 బీహెచ్ కే, 2 బీహెచ్ కే ఫ్లాట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఇక్కడ రాజీవ్ స్వగృహ ఫ్లాట్ ధర ఒక్క ఎస్ఎఫ్ టీ కి రూ.3 వేలు ఉండగా, మార్కెట్ లో రూ.6 వేలు పలుకుతోంది. రూ.50 లక్షలకే 3 బీహెచ్ కే వస్తుండటంతో మరికొంత ఖర్చు చేసి రెనోవేషన్ చేస్తే ఫ్లాట్ బాగుంటుందని పబ్లిక్ భావిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. 

రెండు దశల్లో వేలం 

బండ్లగూడలో ఫ్లాట్స్ కు ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు వేలం నిర్వహించనున్నారు. పోచారంలో వచ్చే నెల 1 నుంచి 7 వరకు వేలం నిర్వహించనున్నారు. 3 బీహెచ్ కే డీలక్స్, 3 బీహెచ్ కే ఫ్లాట్లకు రూ. 3 లక్షలు,  2 బీహెచ్ కేకు రూ.2 లక్షలు, 1 బీహెచ్ కేకు రూ. లక్ష చొప్పున టోకెన్ అమౌంట్ డీడీని ఆ రెండు ప్రాంతాల్లో అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది. అందుబాటులో ఉన్న ఫ్లాట్లలో తమకు నచ్చిన ఫ్లాట్ ను సెలక్ట్ చేసుకొని వేలంలో పాల్గొనే అవకాశం కల్పించారు. కార్ పార్కింగ్, డెవలప్ మెంట్ చార్జీలు అదనంగా చెల్లించాలని వేలం నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అధికారులు నిర్ణయించిన ధర కంటే వేలంలో ఎక్కువగానే పలికే అవకాశాలు ఉన్నాయి.