
- ఏటా రోడ్డు ప్రమాదాలతో ప్రాణాలు కోల్పోతున్న ప్రజలు
- జంక్షన్లలో సిగ్నల్స్, హైమాస్ట్ లైట్లనూ పట్టించుకోవట్లే
- బ్లాక్ స్పాట్ల వద్ద సీసీ కెమెరాలు, స్పీడ్గన్స్ఏర్పాటుకు
- పోలీస్‌శాఖ ఏర్పాట్లు
- 20 ఏండ్లుగా విస్తరణ పనులు చేయకపోవడమే కారణం
పెద్దపల్లి, వెలుగు: కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో రాజీవ్హైవే డేంజర్‌గా మారింది. రెండు జిల్లాల్లో పోలీసు శాఖ 41 డేంజర్స్పాట్లను గుర్తించగా.. అందులో పెద్దపల్లి జిల్లాలో 21, కరీంనగర్ జిల్లాలో 20 ఉన్నాయి. రోడ్డు ప్రమాదాల్లో ఏటా పెద్ద సంఖ్యలో వాహనదారులు మృత్యువాతపడుతున్నారు. రోడ్డుకు ఇరువైపులా సైన్ బోర్డులు ఏర్పాటు చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. జంక్షన్లలో సిగ్నల్స్, హైమాస్ట్ లైట్లను ఏర్పాటు చేయడం లేదు. ఈ మధ్య కాలంలో డేంజర్ స్పాట్లలో సీసీ కెమెరాలు, స్పీడ్గన్స్ఏర్పాటు చేయడానికి పోలీసుశాఖ కసరత్తు చేస్తుంది. గడిచిన 20 ఏండ్లుగా రాజీవ్ రహదారిని విస్తరించకపోవడం మూలంగానే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు.
రాజీవ్ హైవే హైదరాబాద్‌నుంచి కరీంనగర్ మీదుగా పెద్దపల్లి, గోదావరిఖని నుంచి మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం క్రాస్‌లో ఉన్న గ్రీన్ ఫీల్డ్ హైవేతో కలుస్తుంది. 20 ఏండ్లుగా ఎలాంటి విస్తరణ లేకపోవడంతో పట్టణాల మీదుగా పొతున్న రహదారిపైకి దుకాణాలు చేరాయి. కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల పరిధిలో దాదాపు 100 కిలో మీటర్ల పరిధిలో రాజీవ్ రహదారి ఉంది. పెద్దపల్లి 55 కిలోమీటర్లు, కరీంనగర్45 కిలో మీటర్లు విస్తరించి ఉంది. మరమ్మతుల పేరిట ప్యాచ్వర్క్చేసి వదిలేస్తున్నారని ఆర్‌అండ్‌బీపై ఆరోపణలున్నాయి. జిల్లాను ఆనుకొని పోతున్న గ్రీన్‌ఫీల్డ్ హైవేకు రాజీవ్ రహదారిని అనుసంధానించి జాతీయ హోదా కల్పించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
డేంజర్ స్పాట్స్...
మొత్తం 41 బ్లాక్ స్పాట్ లను అధికారులు గుర్తించగా.. కరీంనగర్పరిధిలో నుస్తులాపూర్, తిమ్మాపూర్, అలుగునూర్, సుల్తానాబాద్ మండల పరిధిలోని భూపతిపూర్, కాట్నపల్లి, దుబ్బపల్లి, గర్రెపల్లి, సుగ్లాంపల్లి, సుల్తానాబాద్ ఉన్నాయి. పెద్దపల్లి మండల పరిధిలో అప్పన్నపేట, పెద్ద కల్వల, రంగంపల్లి, శాంతినగర్, మంథని ఆర్ఓబీ, రాయపట్నం రోడ్, బంజేరుపల్లి, కటికనపల్లి, ధర్మారం క్రాస్ రోడ్, రామగుండం మండల పరిధిలో మేడిపల్లి సెంటర్, ఐఓసీ, బీ పవర్హైజ్, రామగుండం మున్సిపల్ ఆఫీస్ క్రాస్, గోదావరిఖని బస్టాండ్, గంగానగర్, పెద్దపల్లి నుంచి మంథని రోడ్‌లోని సబ్బితం ప్రాంతాలు ప్రమాదాలకు నిలయంగా మారాయి. ఈ స్పాట్లలో ఏటా పెద్ద సంఖ్యలో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. కాగా రాజీవ్ రహదారిపై రోడ్డు విస్తరణ, బైపాస్ రోడ్ల నిర్మాణం గురించి కాంగ్రెస్ సర్కార్ దృష్టి సారించింది. కానీ రోడ్డు వైడనింగ్పై రోడ్డు పక్కన ఉన్న ఆస్తుల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రమాదాల నివారణకు...
ప్రమాదాల నివారణ కోసం ఆయా శాఖలు చర్యలు మొదలు పెట్టాయి. పోలీసుశాఖ గుర్తించిన డేంజర్ స్పాట్లలో తాత్కాలిక విస్తరణ చేపట్టాలని నిర్ణయించారు. ప్రతీ జంక్షన్లో సిగ్నల్స్ తో పాటు హైమాస్ట్ లైట్లు, సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. డేంజర్ స్పాట్లలో రోడ్లపై ఉన్న చెట్లు, మొక్కలను తొలగించే ప్లాన్ చేశారు. ప్రతీ మూల మలుపు వద్ద రేడియం బోర్డులు ఏర్పాటు చేయనున్నారు, వాహనదారుల స్పీడ్ నియంత్రించడానికి డేంజర్ స్పాట్ల వద్ద సీసీ కెమెరాలతో పాటు స్పీడ్ గన్స్ ఏర్పాటు చేసినట్లు పోలీసుశాఖ స్పష్టం చేసింది.
అంతే కాకుండా జిల్లాలోని రెండు ప్రధాన పట్టణాలు పెద్దపల్లి, సుల్తానాబాద్‌లకు సంబంధించి బైపాస్ రోడ్ల నిర్మాణాలకు సంబంధించి ప్రణాళికలు సిద్దంగా ఉన్నాయి. కానీ వాటి కార్యచరణ మాత్రం ముందుకు సాగడం లేదు. బైపాస్ రోడ్ల నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు.