హరితరహారం చెట్లను కొట్టేసిన్రు

హరితరహారం చెట్లను కొట్టేసిన్రు

శామీర్ పేట, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమానికి తూట్లు పడుతున్నాయి. వారంలో రెండు సార్లు సీఎం ప్రయాణించే మేడ్చల్ జిల్లా తుర్కపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని రాజీవ్ రహదారికి  ఇరువైపులా ఉన్న హరితహారం చెట్లను ఇష్టానుసారంగా నరికి వేస్తున్నారు. తాము కట్టుకున్న కమర్షియల్ బిల్డింగులు, ఫంక్షన్ హాళ్లు, కాంప్లెక్స్​లు, డ్రైనేజీలకు అడ్డుగా ఉన్నాయని హరితహారం చెట్లను ఇష్టమొచ్చినట్లు తొలగిస్తున్నారు. ఒక్క మొక్కను నరికితే వంద మొక్కలు నాటాలని రాష్ట్ర ప్రభుత్వం నినాదాలు చేస్తుంటే.. అధికార పార్టీకి చెందిన ప్రముఖులే చెట్లను నరికివేయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

దాదాపు 50 చెట్లు..

సామాన్యుడి నుంచి ప్రముఖుల వరకు హరితహారం కార్యక్రమంలో భాగస్వాములను చేస్తూ మొక్కల నాటే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మొక్కలు నాటి పర్యావరణానికి పెద్ద పీట వేస్తున్నామని వేదికల మీద లీడర్లు చెప్తుంటారు. కానీ ఆ లీడర్లే చెట్లను నరికివేయిస్తున్నారు. ఈ తుర్కపల్లి రూట్​లోనే సీఎం కేసీఆర్ వారంలో రెండు సార్లు తన ఫామ్ హౌజ్ కు వెళ్లి వస్తుంటారు. మూడో విడత హరితహారం కార్యక్రమాన్ని కూడా సీఎం ఇక్కడ మొక్కలు నాటి శ్రీకారం చుట్టారు. అయితే, అటవీ శాఖ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండానే తుర్కపల్లిలో ఏకంగా దాదాపు 50 చెట్లను నరికివేశారు. చెట్లను నరికేస్తే కేసులు పెడతామని హెచ్చరించే అటవీ శాఖ అధికారులు.. అధికార పార్టీ నాయకులు ఇష్టానుసారంగా కొట్టేయిస్తుంటే కనీసం ఆ వైపు కన్నెత్తి చూడటం లేదని పర్యావరణ ప్రేమికులు ఆరోపిస్తున్నారు. ఈ మార్గంలోని అలియాబాద్ చౌరస్తా వద్ద తన కన్వెన్షన్ హాల్​కు అడ్డుగా ఉన్నాయని కొన్ని మొక్కలను మంత్రి మల్లారెడ్డి గతంలో  తొలగించిన ఘటన మర్చిపోకముందే తుర్కపల్లిలో తాజాగా ఈ ఘటన చోటుచేసుకుంది.

ఫైన్​ వేశాం: ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్

చెట్ల నరికివేత ఘటనపై ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ విజయ భాస్కర్​ను వివరణ కోరగా.. చెట్లను నరికివేసిన వారితో రూ.40 వేల ఫైన్ కట్టిపించామని, పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. ఇకముందు ఇలాంటి ఘటనలకు పాల్పడితే సీరియస్​ యాక్షన్  తీసుకుంటామని హెచ్చరించినట్లు తెలిపారు.‌‌