రాజీవ్ స్వగృహ ఫ్లాట్లు..సింగిల్ బెడ్రూమ్ రూ.13 లక్షలే..!

రాజీవ్ స్వగృహ ఫ్లాట్లు..సింగిల్ బెడ్రూమ్ రూ.13 లక్షలే..!
  • డబుల్ బెడ్​రూమ్ రూ.25 లక్షలు
  • పోచారం సద్భావన టౌన్​షిప్​లో ఫిక్స్ రేట్లు
  • ఎండీ వి.పి. గౌతమ్

ఘట్​కేసర్, వెలుగు: పోచారంలోని సద్భావన టౌన్​షిప్​లో మిగిలిన ఫ్లాట్లను పేద, మధ్యతరగతి ప్రజలకు సరసమైన ధరల్లో విక్రయిస్తున్నట్లు రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఎండీ వి.పి. గౌతమ్ తెలిపారు. పోచారం టౌన్​షిప్​ను బుధవారం ఆయన సందర్శించి, ఫ్లాట్లు, మౌలిక సదుపాయాలను పరిశీలించారు. 30 ఎకరాల విస్తీర్ణంలో విశాలమైన రోడ్లు, మధ్యలో ఖాళీ స్థలం, మంచి వెంటిలేషన్​తో నిర్మించిన ఈ టౌన్​షిప్​లో ఇప్పటికే వెయ్యికి పైగా కుటుంబాలు నివసిస్తున్నాయన్నారు. 

పోచారంలో మిగిలిన 255 సింగిల్​ బెడ్​రూమ్ ఫ్లాట్లు రూ.13 లక్షలకు, 340 డబుల్ బెడ్​రూమ్ ఫ్లాట్లను రూ.25 లక్షలకు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇవన్నీ గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఉప్పల్– నారపల్లి ఫ్లైఓవర్ పూర్తయితే టౌన్​షిప్​కు 10 నిమిషాల ప్రయాణమని, ఇన్ఫోసిస్, రహేజా ఐటీ పార్క్, ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో ఫ్లాట్లు ఉన్నాయన్నారు. బహిరంగ మార్కెట్​లో ఫ్లాట్ల ధరలు రూ.50 లక్షలకు తక్కువ లేవని, ఈ అవకాశాన్ని మధ్యతరగతి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 

దరఖాస్తుదారుల నుంచి టోకెన్ అడ్వాన్స్ తీసుకొని, లాటరీ పద్ధతిలో ఫ్లాట్లు కేటాయించనున్నట్లు చెప్పారు. బండ్లగూడ సహభావన టౌన్​షిప్​లోనూ ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయని,  పూర్తి వివరాలకు  www.swagruha.telangana.gov.in వెబ్​సైట్ సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ఆయన వెంట అధికారులు భాస్కర్, నరేందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, శ్రీనివాస్, బాలాజీ తదితరులు ఉన్నారు.