చెన్నై: తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. తిరువళ్లూరులోని ఓ రొయ్యల ఫ్యాక్టరీలో అమ్మోనియం గ్యాస్ లీక్ అయ్యి ఏడుగురు మహిళలు మృతి చెందారు. మరో 40 మంది అస్వస్థతకు గురయ్యారు. ఇందులో 21 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటన స్థలంలో పోలీసులు, అత్యవసర బృందాలు సహయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను వైద్య చికిత్స కోసం ఆసుపత్రులకు తరలించారు.
గ్యాస్ లీకేజీతో తీవ్ర భయాందోళనకు గురైన కార్మికులు కొందరు భయంతో బయటకు పరుగులు తీశారు. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో మొత్తం 70 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గ్యాస్ లీకేజీకి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాక్టరీ యాజమానితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
గ్యాస్ లీక్ ఘటనపై సీఎం విజయ్ దిగ్భ్రాంతి:
తిరువళ్లూరులోని రొయ్యల ఫ్యాక్టరీలో అమ్మోనియం గ్యాస్ లీక్ అయ్యి ఏడుగురు మృతి చెందిన ఘటనపై తమిళనాడు సీఎం విజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. వెంటనే ఘటన స్థలానికి వెళ్లాలని మంత్రులను ఆదేశించారు. సహయక చర్యలను వేగవంతం చేయాలని సూచించారు. బాధితులకు మెరుగైన వైద్య సహయం అందించాలని ఆదేశించారు. ఈ ఘటనపై విచారణకు త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేశారు. మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించారు.
►ALSO READ | ఆలయంలో మండపం కూలి ఐదుగురు మృతి.. మహారాష్ట్రలో ఘోర ప్రమాదం
