మమత, స్టాలిన్కు రాజ్నాథ్ సింగ్ లేఖ

మమత, స్టాలిన్కు రాజ్నాథ్ సింగ్ లేఖ

ఢిల్లీ : గణతంత్ర దినోత్సవ కవాతు కోసం తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల శకటాలను తిరస్కరించడంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వివరణ ఇచ్చారు. నిబంధనలకు అనుగుణంగానే శకటాల ఎంపిక జరిగినట్లు తెలిపారు. ఈ మేరకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీలకు లేఖ రాశారు. తమిళనాడుకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుల గురించి చాటిచెప్పే విధంగా ఆ రాష్ట్రం శకటాన్ని ప్రతిపాదించగా కేంద్రం దాన్ని తిరస్కరించింది. దీంతో సీఎం స్టాలిన్ ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాశారు. మరోవైపు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి వివరించే శకటాన్ని బెంగాల్ ప్రభుత్వం ప్రతిపాదించగా దీన్ని కూడా కేంద్రం రిజెక్ట్ చేసింది. కేంద్రం నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీఎం మమతా బెనర్జీ ప్రధాని మోడీకి లేఖ రాశారు. బెంగాల్ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని అందులో మండిపడ్డారు. 

ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నేతాజీకి సమున్నత గౌరవం ఇస్తుందని మమతకు రాసిన లేఖలో రాజ్ నాథ్ స్పష్టం చేశారు. నేతాజీ జయంతిని పరాక్రమ్ దివస్ గా నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ ఏడాది నుంచి గణతంత్ర దినోత్సవాలు నేతాజీ జయంతి రోజు నుంచి ప్రారంభమై, జనవరి 30తో ముగుస్తాయని చెప్పారు. కళలు, సంస్కృతి, సంగీతం, నృత్య రంగాలకు చెందిన ప్రముఖులతో కూడిన కమిటీ శకటాలను ఎంపిక చేసిందని చెప్పారు. 2016, 2017, 2019, 2021 సంవత్సరాల్లో గణతంత్ర దినోత్సవాల్లో బెంగాల్ ప్రభుత్వ శకటాలకు అనుమతించిన విషయాన్ని రాజ్నాథ్ గుర్తు చేశారు. మరోవైపు తమిళనాడు సీఎం స్టాలిన్ కు రాసిన లేఖలో నిబంధనల ప్రకారమే శకటాల ఎంపిక జరిగిందని చెప్పారు. మొదటి మూడు రౌండ్ల వరకు తమిళనాడు శకటానికి గ్రీన్ సిగ్నల్ లభించినా.. చివరి 12 శకటాల్లో మాత్రం చోటు దక్కించుకోలేకపోయిందని స్పష్టం చేశారు.

 

ఇవి కూడా చదవండి..

ఆన్లైన్లో పెళ్లి.. అతిధుల ఇంటికే భోజనం..