నీది నాది ఒకే కథ, విరాటపర్వం చిత్రాలతో దర్శకుడిగా తనదైన శైలిలో మెప్పించిన వేణు ఊడుగుల నిర్మాతగా మారి.. రాహుల్ మోపిదేవితో కలిసి ‘రాజు వెడ్స్ రాంబాయి’ అనే చిత్రాన్ని నిర్మించారు. అఖిల్, తేజస్విని జంటగా సాయిలు కంపాటి తెరకెక్కించిన ఈ చిత్రం నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకొస్తోంది.
ఈ సందర్భంగా నిర్మాతలు చిత్ర విశేషాలను గురించి వివరించారు. వేణు ఊడుగుల మాట్లాడుతూ ‘ ఖమ్మం, వరంగల్ జిల్లాల మధ్య జరిగిన రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా దర్శకుడు ఈ ప్రేమకథను రాశాడు. నేను నిర్మాతనైతేనే ఈ కథకు న్యాయం జరుగుతుంది అనిపించింది. ఈటీవీ విన్‌తో పాటు వంశీ నందిపాటి, బన్నీ వాస్‌లతో అసోసియేట్ అవడం హ్యాపీ. ఇందులో లవ్‌స్టోరీతో పాటు చక్కని డ్రామా, ఎంటర్‌టైన్మెంట్, ఎమోషన్ ఉంటాయి.
7జీ బృందావన్ కాలనీ, సైరత్, ప్రేమిస్తే చిత్రాల తరహాలో ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. అలాగని విషాదకరమైన ముగింపు ఉండదు. సినిమా చూసిన ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తుంది. ఇది చూశాక అమ్మాయిల తండ్రుల్లో కొందరైన తమ కూతురి ప్రేమ విషయంలో పాజిటివ్‌గా ఆలోచిస్తారని నమ్ముతున్నాం” అని చెప్పారు.
మరో నిర్మాత రాహుల్ మోపిదేవి మాట్లాడుతూ ‘15 ఏళ్ల క్రితం ఘటన జరిగిన మారుమూల గ్రామంలోనే షూటింగ్ జరిపాం. అఖిల్, తేజస్విని ఎంతో సహజంగా నటించారు. హీరోయిన్ తండ్రి వెంకన్న పాత్రకు చైతన్య జొన్నలగడ్డను ఆడిషన్ చేసి తీసుకున్నాం. కొన్ని పాత్రలకు ఆ ఊర్లోని వాళ్లని తీసుకున్నాం. వర్షాకాలంలో వరదల మధ్య రోజుకో సమస్యతో అక్కడ షూటింగ్ చేశాం. మా దర్శకుడు ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తి కనుక ఆ ఘటనకు డ్రామా యాడ్ చేసి అద్భుతంగా తెరకెక్కించాడు’ అని తెలియజేశారు.
