యాంటీ టెర్రరిస్టు బిల్లుకు రాజ్యసభ అమోదం

యాంటీ టెర్రరిస్టు బిల్లుకు రాజ్యసభ అమోదం
  • సంస్థల్ని బ్యాన్​ చేస్తే చాలు వ్యక్తులపై ముద్రలొద్దు: కాంగ్రెస్​
  • వేరే సంస్థల్లో చేరి కుట్రలు చేస్తారు కాబట్టే వ్యక్తుల్నీ టెర్రరిస్టులుగా ప్రకటించాలి: అమిత్​ షా కౌంటర్​​
  • హోం మంత్రి విమర్శలు చేసినా సర్కారుకే మద్దతిచ్చిన కాంగ్రెస్
  • ప్రజాస్వామ్యానికి కాంగ్రెస్​ వెన్నుపోటు పొడిచిందన్న లెఫ్ట్

న్యూఢిల్లీ: చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ) సవరణ బిల్లుకు శుక్రవారం రాజ్యసభ ఆమోదం తెలిపింది. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల్ని ఇకపై టెర్రరిస్టులుగా ప్రకటించే అధికారాన్ని ప్రభుత్వానికి కల్పించే ఈ కీలక బిల్లుకు అనూహ్యరీతిలో ప్రతిపక్ష కాంగ్రెస్, బీఎస్పీ​ పార్టీలు మద్దతు తెలిపాయి. టెర్రరిస్టు కేసుల్లో దర్యాప్తులో భాగంగా నిందితుడి వస్తువులు, ఇతర ప్రాపర్టీని​ నేషనల్​ ఇన్వెస్టిగేషన్​ ఏజెన్సీ(ఎన్​ఐఏ) స్వాధీనం చేసుకోవచ్చనే నిబంధనను కూడా ఇందులో ఉంది. బిల్లుపై చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్రవాగ్వాదం నడిచింది. కాంగ్రెస్​ సహా ఇతర ప్రతిపక్షాలు సూచించిన సవరణలు వీగిపోయాయి. కాంగ్రెస్​ సపోర్టుతో సవరణ బిల్లుకు అనుకూలంగా 147 ఓట్లురాగా, వ్యతిరేకంగా 42 ఓట్లు పడ్డాయి. దీంతో బిల్లు పాసైనట్లు చైర్మన్​ ప్రకటించారు. రాష్ట్రపతి ఆమోదం తర్వాత ఇది చట్టంగా అమలులోకి రానుంది. రాజ్యసభలో ప్రతిపక్షాల బలమే ఎక్కువున్నా, ప్రస్తుత సెషన్​లో బీజేపీ సర్కార్​ ఆమోదింపజేసుకున్న మూడో కీలక బిల్లు ఇది. ఇంతకుముందు ఆర్టీఐ సవరణ, ట్రిపుల్​ తలాక్​ రద్దు బిల్లులూ పెద్దల సభలో పాసయ్యాయి.

వ్యక్తుల వల్లే టెర్రరిజం వ్యాప్తి: అమిత్​ షా​

చర్చలో భాగంగా కాంగ్రెస్​ ఎంపీ చిదంబరం మాట్లాడుతూ, ఇప్పటికే అమల్లో ఉన్న యూఏపీఏ చట్టం ప్రకారం చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే సంస్థల్ని టెర్రర్​ గ్రూపుగా ప్రకటించే వీలుందని, అలాంటప్పుడు కొత్తగా ‘వ్యక్తులపైనా టెర్రరిస్టు ముద్ర వేసే’ సవరణ తేవాల్సిన అవసరం ఏముందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీని ద్వారా పౌరుల ప్రాథమిక హక్కులు హరించుకుపోయే అవకాశం ఉందన్నారు. చిదంబరం వాదనకు అడ్డుతగిలిన కేంద్ర మంత్రి అమిత్​ షా.. అసలీ యూఏపీఏ చట్టాన్ని రూపొందించిందే (1967లో) కాంగ్రెస్​ పార్టీ అని గుర్తు చేశారు. “చట్టాల దుర్వినియోగం గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్​కు లేదు. టెర్రరిస్టు కేసులకు ఉద్దేశపూర్వకంగా మతం రంగును పూశారు. సంజౌతా ఎక్స్​ప్రెస్​, మక్కా మసీదు పేలుళ్ల కేసుల్లో కోర్టు తీర్పులే అందుకు నిదర్శనం. టెర్రరిజాన్ని దేశం నుంచి తరిమేయడమే మోడీ సర్కార్​ లక్ష్యం. ఒక సంస్థను నిషేధించినంత మాత్రాన సరిపోదు. అందులో పనిచేసిన వ్యక్తులు వేరే పేర్లతో మరో ఆర్గనైజేషన్లు పెట్టుకుని టెర్రరిజాన్ని వ్యాప్తి చేస్తారు. అందుకే వ్యక్తుల్ని కూడా టెర్రరిస్టులుగా గుర్తించే చట్టసవరణను మేం తీసుకొచ్చాం”అని అమిత్​ షా వివరించారు.

టెర్రరిజంపై లెక్చర్లిచ్చే బీజేపీనే టెర్రరిస్టు కేసుల్లో నిందితుల్ని చట్టసభలకు పంపుతోందంటూ కాంగ్రెస్​ ఎంపీ దిగ్విజయ్​ సింగ్​ విమర్శించారు. పరోక్షంగా భోపాల్​ ఎంపీ సాధ్వి ప్రజ్ఞాసింగ్​ను ఉద్దేశించి ఆయనీ కామెంట్లు చేశారు. దిగ్విజయ్​ ఆరోపణల్ని తప్పుపట్టిన అమిత్ షా.. ‘‘ఎన్నికల్లో ఓడిపోయినందుకే దిగ్విజయ్​ ఇంతలా కోప్పడుతున్నారు. మూడు కేసుల్లో ఎన్​ఐఏ విచారణ ఎదుర్కొంటున్న మీరు(దిగ్విజయ్​) కూడా ఎంపీగా ఉన్నారుకదా, యూపీఏ హయాంలో టెర్రరిజానికి మతం రంగులు పూస్తే, ప్రస్తుత ఎన్డీఏ మాత్రం టెర్రరిజం అంతానికి చిత్తశుద్ధిగా పనిచేస్తున్నది’’అని కౌంటరిచ్చారు.

విజన్​లేని కాంగ్రెస్​ వెన్నుపోటు పొడిచింది

బీజేపీ సర్కార్​ రూపొందించిన యూఏపీఏ సవరణ బిల్లుకు మద్దతు పలకడం ద్వారా కాంగ్రెస్​ పార్టీ ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు పొడిచిందని, దేశం పట్ల ఆ పార్టీ విజన్​ కోల్పోయిందని లెఫ్ట్​ పార్టీలు మండిపడ్డాయి. ఫాసిస్టు ధోరణిలో మోడీ ప్రభుత్వం ప్రజల హక్కుల్ని కాలరాస్తున్న తరుణంలో అప్రజాస్వామిక బిల్లుకు కాంగ్రెస్​ మద్దతు పలకడమేంటని సీపీఐ నేత డి.రాజా ప్రశ్నించారు. యూఏపీఏ బిల్లును సపోర్ట్​  చేయడం ద్వారా మైనార్టీలకు కాంగ్రెస్​ తీరని అన్యాయం చేసిందని సీపీఎం నేత కరీం విమర్శించారు.