స్పోర్ట్స్ బిల్లు.. సరైన దిశలో ముందడుగు

స్పోర్ట్స్ బిల్లు.. సరైన దిశలో ముందడుగు
  • కొత్త బిల్లును స్వాగతించిన ఐఓఏ చీఫ్ పీటీ ఉష, ఎన్‌‌ఎస్‌‌ఎఫ్‌‌లు

న్యూఢిల్లీ: నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలపడంపై దేశంలోని స్పోర్ట్స్‌‌ ఫెడరేషన్స్‌‌ (ఎన్‌‌ఎస్‌‌ఎఫ్‌‌) హర్షం వ్యక్తం చేశాయి. కొత్త బిల్లును  స్వాగతిస్తూ దేశ క్రీడారంగాన్ని బలోపేతం చేసేందుకు ఇది అవసరమని అభిప్రాయపడ్డాయి. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) ప్రెసిడెంట్ పీటీ ఉష ఈ బిల్లును అభినందించారు. 2036 ఒలింపిక్స్ కు ఇండియా సిద్ధమవుతున్న సమయంలో ఇది సరైన అడుగు అన్నారు.  

ఈ బిల్లు క్రీడలలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని తీసుకువస్తుందని,  క్రీడాకారులకు కూడా కొత్త శక్తిని ఇస్తుందని చెప్పారు. 2036 ఒలింపిక్స్ బిడ్ కు కూడా ఈ బిల్లు చాలా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.  హాకీ ఇండియా ప్రెసిడెంట్ దిలీప్ టిర్కీ, అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధి ఆదిల్ సుమరివాలా వంటి క్రీడా ప్రముఖులు ఈ బిల్లును చారిత్రక ఘట్టంగా అభివర్ణించారు. 

ఇది క్రీడా రంగంలో ఉన్న సమస్యలను పరిష్కరించి, క్రీడల అభివృద్ధికి తోడ్పడుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది చాలా మంచి బిల్లు అయినప్పటికీ  ఎగ్జిక్యూటివ్‌‌ కమిటీలో సభ్యుల సంఖ్య 15కి పరిమితం చేయడంపై ఆలిండియా టెన్నిస్ అసోసియేషన్ సెక్రటరీ సుందర్ అయ్యర్ కొంత ఆందోళన వ్యక్తం చేశారు.