
అన్నాచెల్లెళ్లు.. అక్కాతమ్ముళ్ల అనుబంధాన్ని పెంచే పండుగ రక్షాబంధన్. ప్రేమను పంచే ఈ పండుగ రోజున వాళ్ల చేతికి రాఖీ కట్టి నోటిని తీపి చేస్తారు. మరి ఈ ఏడాది ఆగస్టు 9 శనివారమే 'రాఖీ పండుగ'. ఇంట్లోనే సులువుగా తీపి వంటకాలను ఇంట్లోనే ట్రై చేయండి.
బ్రెడ్ జామూన్ తయారీకి కావలసినవి
- చక్కెర- ఒక కప్పు
- నీళ్లు- ఒక కప్పు
- ఇలాచీ పొడి- అర టీస్పూన్
- నిమ్మరసం- ఒక టీ స్పూన్
- బ్రెడ్ ముక్కలు - నాలుగు
- పాల పొడి- రెండు టేబుల్ స్పూన్స్
- క్రీమ్– ఒక టేబుల్ స్పూన్
- పాలు-రెండు టేబుల్ స్పూన్స్
- నెయ్యి లేదా నూనె సరిపడ
తయారీ విధానం: పాన్ లో చక్కెర, నీళ్లు, ఇలాచీ పొడి, నిమ్మరసం వేసి లేతపాకం పట్టాలి. మరోవైపు బ్రెడ్ ముక్కల అంచులు కట్ చేసి, మిక్సీలో కచ్చాపచ్చాగా పొడి చేయాలి . ఆ బ్రెడ్ పొడిలోపాల పొడి, క్రీమ్ పాలు పోసి ముద్దగా కలపాలి. దాన్ని కొద్దికొద్దిగా తీసుకుని చిన్న సైజు ఉండలు కట్టాలి. వీటిని నెయ్యి లేదా నూనెలో వేగించి చక్కెర పాకంలో వేయాలి. రెండు గంటల తర్వాత ఈ బ్రెడ్ జామూన్లను తింటే చాలా బాగుంటాయి.
క్యారెట్ హల్వా తయారీకి కావాల్సినవి
క్యారెట్ తురుము - మూడు కప్పులు
నెయ్యి - నాలుగు టేబుల్ స్పూన్లు
చక్కెర - ఒకటిన్నర కప్పు
జీడిపప్పు పలుకులు - పది
ఇలాచీ పొడి - పావు టీస్పూన్
కుంకుమ పువ్వు - చిటికెడు
కిస్ మిస్ – ఒకటేబుల్ స్పూన్
తయారీవిధానం: స్టవ్ పై పాన్ లో పాలు, కుంకుమ పువ్వు వేసి మరిగించాలి. తర్వాత క్యారెట్ తురుము వేసి కలపాలి. సన్నని మంటపై మిశ్రమం దగ్గరపడేదాకా ఉడికించాలి. అప్పుడే క్యారెట్ తురుములోకి పాలు బాగా ఇంకుతాయి. మిశ్రమం గట్టిపడ్డాక అందులో నెయ్యి, చక్కెర, ఇలాచి పొడి వేసి సన్నని మంటపై కొద్దిసేపు పెట్టి, చివరగా నెయ్యిలో వేగించిన జీడిపప్పు .. కిస్ మిస్ పలుకులు వేయాలి. ఈ హల్వాను పిల్లలతో పాటు పెద్దలు కూడా ఇష్టంగా తింటారు
డ్రై ఫ్రూట్ లడ్డూ తయారీకి కావలసినవి
- ఖర్జూరం - పావు కప్పు
- జీడిపప్పు తరుగు - పావు కప్పు
- బాదం తరుగు- పావుకప్పు
- పిస్తా పప్పు పావు కప్పు
- డ్రై ఆఫ్రికాట్స్- ఆరు
- డ్రై ఫిగ్స్-నాలుగు
- ఎండు కొబ్బరి తురుము (కావాలనుకుంటే) – రెండు టేబుల్ స్పూన్లు
- నువ్వులు లేదా గసగసాలు -రెండు టేబుల్ స్పూన్లు
- నెయ్యి - సరిపడా
తయారీ విధానం: పాన్ లో నెయ్యి వేడి చేసి బాదం, జీడిపప్పు బాగా వేగించాలి. తర్వాత పిస్తా పప్పు చేసి మరో రెండు నిమిషాలు వేగించి పక్కనబెట్టాలి. ఆపైన ఆఫ్రికా ట్స్, ఫిగ్స్కా వేడి అయ్యేలా వేగించాలి. ఖర్జూరం, ఆఫ్రికాట్స్, ఫిగ్స్ ను మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి. తర్వాత దాన్ని గిన్నెలోకి తీసుకుని, అందులో జీడిపప్పుల బాదం, పిస్తా తరుగు వేసి కలపాలి ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా చేతుల్లోకి తీసుకుంటూ ఉండలు కట్టాలి ఎండుకొబ్బరి, నువ్వులు లేదా గసగసాలను లడ్డూలపై అద్దాలి. ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూలు ఆరోగ్యానికి చాలా మంచివి.