RGV: షారుక్ ఖాన్ ఇమేజ్‌ను హ్యాండిల్ చేయలేకపోయా.. నిజం ఒప్పుకున్న రామ్ గోపాల్ వర్మ!

RGV: షారుక్ ఖాన్ ఇమేజ్‌ను హ్యాండిల్ చేయలేకపోయా.. నిజం ఒప్పుకున్న రామ్ గోపాల్ వర్మ!

బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటనా నైపుణ్యం, ఫుల్ ఎనర్జీతో  ప్రేక్షకులను మైమరిపిస్తున్నారు. సంజయ్ లీలా భన్సాలీ, ఫర్హాన్ అక్తర్, కరణ్ జోహార్, అశుతోష్ గోవారికర్, ఫరా ఖాన్ వంటి దిగ్గజ దర్శకులతో కలిసి ఆయన ఎన్నో సంచలన విజయాలను అందుకున్నారు. అయితే తనదైన ముద్ర వేసిన ఒక ముఖ్య దర్శకుడు మాత్రం షారుక్‌తో ఎప్పుడూ కలిసి పనిచేయలేదు. ఆయనే సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ .

‘సత్య’ , ‘రంగీలా’ వంటి ఐకానిక్ సినిమాలను అందించిన వర్మ, వివాదాలు, విలక్షణత కలగలిపిన వ్యక్తిత్వం ఆయనది. బాలీవుడ్‌లో ఇంతటి స్టార్‌డమ్ ఉన్న షారుక్‌తో ఆయన ఎందుకు సినిమా తీయలేదనే ప్రశ్న చాలామంది అభిమానుల్లో  ఉంది.. దీనిపై లేటెస్ట్ గా వర్మ ఓ ఇంటర్యూలో  వర్మ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

 కింగ్ ఖాన్ ఎనర్జీ 
 ఇటీవల  ఓ ఇంటర్యూలో షారుక్‌తో ఒక ప్రాజెక్ట్ గురించి చర్చలు జరిగిన మాట వాస్తవమే అని  రామ్ గోపాల్ వర్మ ధృవీకరించారు. అయితే, అనేక సమావేశాల తర్వాత కూడా ఆ కలయిక సాధ్యం కాకపోవడానికి గల అసలు కారణాన్ని ఆయన బయటపెట్టారు. మేము చాలాసార్లు కలిశాం, కానీ నాకు ఎప్పుడూ అనిపించే విషయం ఏమిటంటే.., షారుక్ ఒక లైవ్ వైర్  లాంటివాడు. అతడు ఎప్పుడూ శక్తితో ఉంటాడు. కానీ నా సినిమా మేకింగ్ స్టైల్ చాలా భిన్నంగా, నిశ్శబ్దంగా, ఇంటెన్స్‌గా ఉంటుంది. షారుక్‌ను అలా నియంత్రించడం అనేది ఆయనకు, అలాగే ఆయనను చూడటానికి వచ్చి, ఆయన నుంచి ఆశించే అభిమానులకు అన్యాయం చేయడమే అవుతుందని నేను భావించాను అని వర్మ వివరించారు.

అంతేకాదు షారుక్ ఇమేజ్‌ను హ్యాండిల్ చేయగల సామర్థ్యం తనకు లేదని కూడా వర్మ నిర్మొహమాటంగా ఒప్పుకున్నారు. నేను షారుక్‌ను డైరెక్ట్ చేయాలనే ఆలోచనతో కంఫర్టబుల్‌గా లేను. ఎందుకంటే, ఆయన నా ఫిల్మ్ మేకింగ్ స్టైల్‌కు అస్సలు సింక్‌ అవ్వడు. ఒకానొక సమయంలో.. నేను ఆయనను 'కంపెనీ' సినిమా కోసం సంప్రదించాను. కానీ, మల్లిక్ పాత్ర చాలా నెమ్మదిగా, సోమరిగా కనిపించే వ్యక్తిగా ఉండాలి. అది షారుక్ నుంచి ప్రేక్షకులు ఆశించేదానికి పూర్తి విరుద్ధం. నా దగ్గర ఆయన కోసం ఒక అద్భుతమైన కథ ఉన్నా, అది కార్యరూపం దాల్చలేదు అని వర్మ పేర్కొన్నారు.

దర్శకుడు అవసరం లేని నటుడు!

షారుక్ ఖాన్‌కు నిజానికి ఏ దర్శకుడూ అవసరం లేదని వర్మ అన్నారు. షారుక్ కెమెరా ముందు నిలబడి, ఎటువంటి సాయం లేకుండా కూడా ప్రేక్షకులను అలరించగల అద్భుతమైన సామర్థ్యం కలిగి ఉన్నారని ప్రశంసించారు. షారుక్‌కు ఒక సన్నివేశం గురించి చెబితే, అతడు లేచి వెళ్లి దాన్ని అద్భుతంగా చేస్తాడు. అతను ఫెంటాస్టిక్. కానీ అప్పుడు నా సినిమాలో నేను చేయడానికి ఏమీ లేదని నాకు అనిపించింది. అతని సినిమాలకు దర్శకులు పెద్దగా తేడా చేస్తారని నేను అనుకోను, ఎందుకంటే అతను కేవలం కెమెరా ముందు నిలబడి, ఏమీ లేకుండానే మిమ్మల్ని అలరించగల ప్రదర్శనకారుడు. అది చాలా భిన్నమైన స్టార్‌డమ్ అని వర్మ వ్యాఖ్యానించారు.

ఆగిపోయిన మరో ప్రాజెక్ట్!

 షారుక్ ఖాన్‌తో కలిసి వర్మ పనిచేయాలనుకున్న మరో సినిమా గురించి కూడా సినీ వర్గాలలో చర్చ జరిగింది. గతంలో జర్మన్-ఆస్ట్రియన్ సీరియల్ కిల్లర్ ఫ్రిట్జ్ హార్మాన్ కథ ఆధారంగా ఒక సినిమా చేయాలని ఆర్జీవీ భావించినట్లు. ఆ పాత్రకు షారుక్ అయితే సరిగ్గా సరిపోతాడని కూడా అనుకున్నారట. అయితే, ఆ కథ కూడా వర్మ డార్క్ అండ్ ఇంటెన్స్ స్టైల్‌కు దగ్గరగా ఉండటంతో, షారుక్ ఇమేజ్ దెబ్బతింటుందేమోనని, ఫ్యాన్స్ అంచనాలకు భిన్నంగా ఉంటుందేమోనని ఆయనే వెనక్కి తగ్గారని చెబుతారు. షారుక్ లాంటి భారీ స్టార్‌ను తనదైన చిన్న ఫ్రేములో ఇరికించడం సరైంది కాదని వర్మ నిర్ణయించుకోవడంతో, ఈ ప్రత్యేకమైన కాంబినేషన్ ఎప్పటికీ కలగలేదు. .