ముస్తాబవుతున్న అయోధ్య.. జనవరి 22 మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రాణ ప్రతిష్ఠ

ముస్తాబవుతున్న అయోధ్య.. జనవరి 22 మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రాణ ప్రతిష్ఠ
  • శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వెల్లడి
  • 2024, డిసెంబర్ కల్లా ఆలయ నిర్మాణం పూర్తి

అయోధ్య (యూపీ) : అయోధ్యలో ఈ నెల 22న జరిగే శ్రీరాముడి విగ్రహా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి అయోధ్య ముస్తాబవుతున్నది. అధికారులు నగరాన్ని అలంకరిస్తున్నారు. ప్రతి వీధిలో రాముడి జీవిత చరిత్రకు సంబంధించిన హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు. రామ మందిరం పరిసరాలను లైట్లు, పూలతో  డెకరేషన్ చేశారు. 22వ తేదీన మధ్యాహ్నం 12.20 గంటలకు గర్భగుడిలో రామ్ లల్లాను ప్రతిష్ఠించనున్నారు.  ఈ క్రమంలో ఆలయ నిర్మాణానికి సంబంధించిన కీలక వివరాలను టెంపుల్ కన్​స్ట్రక్షన్ కమిటీ చైర్​పర్సన్ నృపేంద్ర మిశ్రా వివరించారు. ప్రతి భక్తుడూ సంతృప్తి చెందేలా ఆలయ నిర్మాణం చేపడుతున్నట్టు తెలిపారు. మూడు అంతస్తుల్లో ఆలయం నిర్మిస్తున్నట్లు వివరించారు. 2024 డిసెంబర్ కల్లా ఆలయంలోని ఫస్ట్, సెకండ్ ఫ్లోర్ కంప్లీట్ అవుతుందని తెలిపారు. గ్రౌండ్ ఫ్లోర్ పనులన్నీ దాదాపు పూర్తయినట్టు చెప్పారు. విశాలమైన ఆలయ నిర్మాణంలో ఇతర అద్భుతమైన కట్టడాలు కూడా ఉండనున్నాయి. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి సుమారు 7వేలకు పైగా ప్రముఖులకు శ్రీరామ
జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానం పంపింది.

వెయ్యేండ్లైనా చెక్కు చెదరకుండా నిర్మాణం

మర్యాద పురుషోత్తముడు శ్రీరాముడి.. జీవన శైలికి అనుగుణంగా ఆలయ నిర్మాణం జరుగుతున్నది. శ్రీరాముడి నియమాలు, జీవన సూత్రాలు, ఆయన అనుసరించిన మార్గాలు ప్రతిబింబించేలా టెంపుల్ కన్​స్ట్రక్షన్ కమిటీ నిర్మాణాలు చేపడుతున్నది. ఆలయంలోని ప్రతీ కట్టడం.. కళాకారులు ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. వెయ్యేండ్లు అయినా.. ఆలయం చెక్కుచెదరదని కమిటీ చైర్​పర్సన్ నృపేంద్ర మిశ్రా వివరించారు. కమిటీ బాధ్యతలు కూడా పెరిగాయన్నారు. శ్రీరాముడి విగ్రహం కూడా ప్రతి భక్తుడినీ ఎంతో ఆకట్టుకుంటుందని చెప్పారు. ముగ్గురు శిల్పులు మూడు ప్రతిరూపాలను సిద్ధం చేస్తున్నారని, అందులో ఒకదానిని ప్రతిష్ఠిస్తామని వివరించారు. ఆలయం తెరుచుకున్న తర్వాత రోజుకు కనీసం 75 వేల నుంచి లక్ష మంది భక్తులు ఆలయాన్ని సందర్శించే  అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

42 పార్కుల్లో సోలార్ చెట్లు

శ్రీరాముడి టెంపుల్ సిటీ అయోధ్యలో ఎక్కువగా సోలార్ సిస్టమ్​ను ఉపయోగిస్తున్నారు. సోలార్ స్ట్రీట్​లైట్లు, సోలార్ చెట్లు, సోలార్ ఎనర్జీతో నడిచే ఈవీ చార్జింగ్ స్టేషన్​లను సోలార్ సిస్టమ్​తో ఏర్పాటు చేస్తున్నారు. అయోధ్యలోని మొత్తం 42 పార్కుల్లో సోలార్ చెట్లను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్​మెంట్ ఏజెన్సీ (యూపీఎన్​ఈడీఏ) ఈ సోలార్ చెట్లను ఇన్​స్టాల్ చేస్తున్నది. 8 పార్కుల్లో 2.5 కిలో వాట్ సోలార్  చెట్లను, మిగిలిన 34 పార్కుల్లో 1 కిలోవాట్ చెట్లను ఏర్పాటు చేస్తున్నది. పార్కుల్లోని సెంట్రల్ పాయింట్స్​లో  ఇన్​స్టాల్ చేస్తున్నారు. అక్కడే బెంచీలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయోధ్యలోని మొత్తం 52 మెయిన్ లోకేషన్స్​లో ఈ సోలార్ చెట్లు ఇన్​స్టాల్ చేస్తున్నట్లు ప్రాజెక్ట్ మేనేజర్ వివరించారు. ప్రతీ సోలార్ ట్రీ.. అయోధ్య థీమ్​ను తెలియజేస్తుంది.

ఇక్బాల్ అన్సారీకి ఇన్విటేషన్

రామ జన్మభూమి – బాబ్రీ మసీదు కేసులో పిటిషనర్ గా ఉన్న ఇక్బాల్ అన్సారీకి రామ మందిర ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరుకావా లని  శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఇన్వైట్ చేసింది. ట్రస్ట్ సభ్యులు కొటియా పంజిటోలా లోని ఆయన ఇంటికి వెళ్లి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా ఇక్బాల్ మాట్లాడుతూ.. ‘శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించబోతున్నందుకు సంతోషంగా ఉంది. అయోధ్య హిందూ - ముస్లిం - సిక్కు - క్రిస్టియన్ సామరస్యానికి నిలయం. అది ఎప్పటికీ చెక్కుచెదరదు’’ అని అన్నారు.