రామ మందిర ప్రాణప్రతిష్ఠ: 7వేల కిలోల 'రామ్ హల్వా' చేయనున్న నాగ్‌పూర్ చెఫ్

రామ మందిర ప్రాణప్రతిష్ఠ: 7వేల కిలోల 'రామ్ హల్వా' చేయనున్న నాగ్‌పూర్ చెఫ్

అయోధ్యలోని రామాలయ మహాసంప్రోక్షణ మహోత్సవానికి కౌంట్‌డౌన్ ప్రారంభం అయింది. ఈ తరుణంలో నాగ్‌పూర్ చెఫ్ విష్ణు మనోహర్ అయోధ్యలో 7వేల కిలోల 'రామ్ హల్వా'ని సిద్ధం చేయనున్నారు. రామమందిరం ఆవరణలో జరిగే ఈ కార్యక్రమానికి విష్ణు మనోహర్ 12 వేల లీటర్ల సామర్థ్యంతో ప్రత్యేక కడాయి (జ్యోతి) తయారు చేసి అందులో రామ్ హల్వాను సిద్ధం చేయనున్నారు.

పాత్ర బరువు 13- 14వందల కిలోలు

ఈ కడాయి బరువు 13 -14వందల కిలోలుంటుందని విష్ణు మనోహర్ తెలిపారు. ఇది ఉక్కుతో, మధ్య భాగం ఇనుముతో తయారు చేయబడిందని, తద్వారా హల్వా తయారు చేసినప్పుడు అది మాడదన్నారు. దీని కెపాసిటీ 12వేల లీటర్లు అని, అందులో 7వేల కిలోల హల్వా తయారుచేయవచ్చని చెప్పారు. దీన్ని పైకి లేపేందుకు క్రేన్ అవసరమని తెలిపారు. ఈ వంటకానికి 9వందల కిలోల రవ్వ, 1000 కిలోల నెయ్యి, 1000 కిలోల పంచదార, 2వేల లీటర్ల పాలు, 2వేల 5వందల లీటర్ల నీరు, 3వందల కిలోల డ్రై ఫ్రూట్స్, 75 కిలోల యాలకుల పొడిని ఉపయోగించి హల్వాను తయారు చేయనున్నట్లు విష్ణు తెలిపారు.

రామ్‌లల్లాకు ఈ ప్రసాదాన్ని సమర్పించిన తర్వాత సుమారు లక్షన్నర మందికి దీన్ని పంచనున్నారు. ఈ కార్యక్రమానికి పాక్ సేవకు కరసేవ అని పేరు పెట్టామని విష్ణు చెప్పారు. విష్ణు మనోహర్ రామజన్మభూమి ఉద్యమంతో సంబంధం కలిగి ఉన్నారు. ఆయన అయోధ్యలో కరసేవ చేశారు. ఈ ఈవెంట్ ద్వారా రామజన్మభూమి ట్రస్ట్ పేరిట ప్రపంచ రికార్డు కూడా క్రియేట్ అవుతుందని భావిస్తున్నారు.