డేరా బాబాకు మరోసారి పెరోల్..20 నెలల్లో ఇది ఐదోసారి

డేరా బాబాకు మరోసారి పెరోల్..20 నెలల్లో ఇది ఐదోసారి

స్వయం ప్రకటిత దేవుడు డేరా సచ్చా సౌదా చీఫ్ రామ్ రహీమ్‌కు మరోసారి పెరోల్ మంజూరైంది. ఈసారి, బెయిల్ వ్యవధి 30 రోజులు. అతను ప్రస్తుతం రోథక్‌లోని సునారియా జైలులో ఉన్నాడు. పెరోల్ కోసం అతని దరఖాస్తును అంగీరించడంతో... ఈ సాయంత్రం వరకు బెయిల్ బాండ్ ప్రక్రియ పూర్తి కానున్నట్టు తెలుస్తోంది. అంటే వివాదాస్పద, శిక్షార్హుడైన రామ్ రహీమ్.. సిర్సా ఆశ్రమాన్ని సందర్శించడానికి కోర్టుకు అనుమతి ఇవ్వకపోవడంతో.. బాగ్‌పత్‌లోని బర్వానాలోని తన యూపీ ఆశ్రమానికి వెళ్లనున్నట్టు సమాచారం.

రామ్ రహీమ్‌కు పెరోల్ మంజూరు కావడం గత 20 నెలల్లో ఇది ఐదవసారి. అంటే తొమ్మిది నెలల కంటే తక్కువ వ్యవధిలో మూడోసారన్న మాట. అంతకుముందు, హర్యానా పంచాయితీ ఎన్నికలు, అడంపూర్ అసెంబ్లీ ఉపఎన్నికలకు ముందు అతను అక్టోబర్ 2022లో 40 రోజుల పెరోల్‌పై విడుదలయ్యాడు. అతను మొదటిసారిగా అక్టోబర్ 24, 2020న పెరోల్ పొందాడు. 30 నెలలు లేదా రెండున్నరేళ్లలో అతనికి పెరోల్ మంజూరు కావడం ఇది ఏడోసారి.

ఈ సందర్భంగా మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ స్వాతీ మాలీవాల్ ట్వీట్ చేశారు. మణిపూర్ లో ఇటీవల జరిగిన ఘటనతో దేశమంతా ఆగ్రహంతో ఉన్నారని, ఈ క్రమంలోనే రామ్ రహీమ్ కు హర్యానా కోర్టు పెరోల్ ఇచ్చిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

मणिपुर में जो हुआ वो देखके पूरे देश वैसे ही आक्रोश में है… पीछे से हरियाणा सरकार ने बलात्कारी Ram Rahim को दोबारा Parole दे दी है।

— Swati Maliwal (@SwatiJaiHind) July 20, 2023

అత్యాచారం, హత్య కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష..

ఇద్దరు మహిళా అనుచరులపై అత్యాచారం చేసిన కేసులో పంచకులలోని ప్రత్యేక సీబీఐ కోర్టు 2017 ఆగస్టులో సిర్సా బాబాను దోషిగా నిర్ధారించింది. 2003లో పంజాబ్, హర్యానా హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు సీబీఐ కేసు నమోదు చేసి, గతంలో కురుక్షేత్రలోని సదర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు దర్యాప్తును చేపట్టింది. ప్రస్తుతం అతను అత్యాచారం, హత్య కేసులో 20 ఏళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్నాడు.