అయోధ్య : AI కెమెరాలతో యాంటీ డ్రోన్ సిస్టమ్

అయోధ్య : AI కెమెరాలతో యాంటీ డ్రోన్ సిస్టమ్

అయోధ్యలో సంప్రోక్షణ (ప్రాణ్ ప్రతిష్ట) వేడుకకు సర్వత్రా సన్నద్దమవుతోంది. విస్తృతమైన భద్రత నడుమ జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అధునాతన భద్రత, ట్రాఫిక్ నిర్వహణతో కూడిన సమగ్ర ప్రణాళికను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా సీసీటీవీ కెమెరాలు, యాంటీ-డ్రోన్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు.

ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్

ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ITMS) సాయంతో నగరం అంతటా 1500 పబ్లిక్ సీసీటీవీ కెమెరాలతో సమగ్రమైన నిఘాను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. అయోధ్యలోని ఎల్లో జోన్‌లో ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీతో కూడిన 10,715 AI ఆధారిత కెమెరాలు అమర్చారు. ఈ కెమెరాలు ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ITMS)తో అనుసంధానించబడతాయి. వీటిని సెంట్రల్ కంట్రోల్ రూమ్ నుండి పర్యవేక్షిస్తారు. రికబ్‌గంజ్, సివిల్ లైన్, హనుమాన్ గుహ, శ్రీ రామ్ హాస్పిటల్, నయా ఘాట్, సాకేత్ పెట్రోల్ పంప్, దేవ్‌కలి బైపాస్, సుల్తాన్‌పూర్ బైపాస్, రాయ్ బరేలీ బైపాస్, సహదత్‌గంజ్ బైపాస్, గురు గోవింద్ సింగ్ స్క్వేర్, పోలీస్ లైన్, తేధి బజార్ వంటి పలు ప్రదేశాల్లో ట్రాఫిక్ ను పర్యవేక్షించనున్నారు.

యాంటీ డ్రోన్ వ్యవస్థ

ఉత్తరప్రదేశ్ పోలీసులు రాబోయే రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమంలో వైమానిక ముప్పుల నుండి భద్రత కల్పించడానికి యాంటీ-డ్రోన్ సిస్టమ్‌ను కూడా మోహరిస్తారు. యాంటీ-డ్రోన్ వ్యవస్థను ఉత్తరప్రదేశ్ పోలీసుల ప్రత్యేక భద్రతా దళం (SSF) పర్యవేక్షిస్తుంది. వీటన్నింటితో పాటు జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF), రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF) బృందాలు కూడా ఇప్పటికే మోహరించబడ్డాయి. SDRF బృందాలు సాధారణ పడవ గస్తీని నిర్వహిస్తాయి. లైఫ్ జాకెట్లు, నావిగేటర్లకు తప్పనిసరి ID కార్డ్‌లు వంటి భద్రతా చర్యలను అమలు చేస్తాయి. ఇక అయోధ్య రైల్వే స్టేషన్‌లో జనవరి 27- ఫిబ్రవరి 15 వరకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ భద్రతను పెంచడం గమనార్హం.