
ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రామమందిరంలోకి భక్తులను అనుమతించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆలయ గర్భగుడిలో దేవతామూర్తులను ప్రతిష్టించిన తర్వాత 2024 జనవరి నుంచి రాముడిని దర్శించుకునేందుకు భక్తులకు అనుమతి ఇవ్వనున్నట్లు రామమందిర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు.
మకర సంక్రాంతి రోజు గర్భగుడిలో రామ్ లల్లా విగ్రహాన్ని ప్రతిష్టించనున్నట్లు చంపత్ రాయ్ వెల్లడించారు. ఆ తర్వాత రామ మందిరం భక్తుల కోసం తెరవబడుతుంది. ఇప్పటికే 50 శాతం వరకు పనులు పూర్తయ్యాయి. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి కానుంది. ఎంత పెద్ద ప్రమాదాలు ఎదురైనా, భూకంపాలను కూడా తట్టుకుని.. సుమారు వెయ్యి సంవత్సరాలకు పైగా నిలబడేంత దృఢంగా ఆలయాన్ని నిర్మిస్తున్నారు. మొత్తం 392 స్తంభాలు, 12 తలుపులు అమర్చారు. ఇనుప కడ్డీలు ఉపయోగించకుండా ఈ ఆలయ నిర్మాణం జరుగుతోంది. రాళ్లను కలిపేందుకు ఇనుముకు బదులు రాగి చిప్‌లను వినియోగిస్తున్నారని ట్రస్టు సభ్యులు తెలిపారు.
ప్రధాన ఆలయం పరిమాణం 350x250 అడుగులు ఉంటుందని చంపత్ రాయ్ చెప్పారు. ప్రధాని మోడీ సూచన మేరకు.. ఆలయం తెరిచిన తర్వాత దాని చుట్టూ ఐదు కిలోమీటర్ల వరకు పాదాల ప్రభావాన్ని అంచనా వేయడానికి అధ్యయనం జరగనుందని ఆయన తెలిపారు. మొత్తం రూ.1800 కోట్లతో ఆలయాన్ని నిర్మిస్తున్నారు. గర్భగుడిలో 160 స్తంభాలను నిర్మించారు. ఆలయం మొదటి అంతస్తులో 82 స్తంభాలు ఏర్పాటు చేశారు. మొత్తం మీద, ఈ నిర్మాణంలో టేకు చెక్కతో చేసిన 12 ప్రవేశ ద్వారాలు ఉంటాయి. రాజస్థాన్ నుంచి తీసుకొచ్చిన గ్రానైట్ రాళ్లను ఉపయోగించి.. 2.7 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయ నిర్మాణం జరుగుతోంది.