
- ఏప్రిల్ 2న శంకుస్థాపన చేసే అవకాశం
- శ్రీరామ జన్మభూమి న్యాస్ సభ్యుల వెల్లడి
- అయోధ్య ట్రస్టులో మోడీ, అమిత్‌షా, యోగి ఉండాలని వ్యాఖ్య
- ఆంక్షలు సడలించిన పోలీసులు.. ఆలయ పరిసరాల్లోకి వాహనాలకు అనుమతి
అయోధ్య నుంచి వెలుగు ప్రతినిధి: వచ్చే ఏడాది ఏప్రిల్ 2న శ్రీరామ నవమి రోజునే రామ మందిరం నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయని శ్రీరామ జన్మభూమి న్యాస్ ట్రస్టు వెల్లడించింది. మూడు నెలల్లో ఆలయ ట్రస్టును ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు సూచించిన నేపథ్యంలో, ట్రస్టు కొలువుదీరిన వెంటనే ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలిపింది. ఆలయ నిర్మాణానికి సంబంధించిన 70 శాతం రా మెటీరియల్ సిద్ధంగా ఉందని చెప్పింది. సోమవారం అయోధ్యలో శ్రీరాం జన్మభూమి న్యాస్ ట్రస్టుకు చెందిన సభ్యులు పలు విషయాలను ‘వెలుగు’తో పంచుకున్నారు. ప్రస్తుతం శిలా న్యాస్ లో పనులు నిలిచిపోయాయని, త్వరలోనే ఆ పనులు ప్రారంభం కానున్నాయని చెప్పారు. శిలా న్యాస్ లో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత, ఆలయ స్తంభాలు, శిల్పాల పనులు తిరిగి ప్రారంభించనున్నట్లు తెలిపారు.
అయోధ్య ట్రస్టులో మోడీ ఉండాలె
కొత్తగా ఏర్పాటు చేయబోయే అయోధ్య ట్రస్టులో మెంబర్లుగా ప్రధాని మోడీతోపాటు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉండాలని న్యాస్ సభ్యులు కోరుతున్నారు. ట్రస్టులో వారు ఉండటం వల్ల ఆలయం త్వరగా పూర్తవుతుందని చెబుతున్నారు. ఈ అంశంపై అయోధ్యలోని ఒక ప్రాంతంలో మహంత్(స్వామీజీలు)లు ప్రత్యేకంగా భేటీ అయినట్లు సమాచారం. అందరికీ అమోదయోగ్యంగా, మనోభావాలు, విశ్వాసాలకు తగ్గట్లుగా ఆలయం నిర్మాణం సాగాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఆలయ నిర్మాణ పనులను అవసరమైతే శ్రీరామనవమికి ముందే చేపట్టాలని కొందరు తమ అభిప్రాయాన్ని తెలిపినట్లు సమాచారం. మరోవైపు వీహెచ్ పీ, రామ జన్మ భూమి న్యాస్ తో కలిసి ఆలయ నిర్మాణం బ్లూ ప్రింట్ పై దృష్టి సారించింది.
ఆంక్షల నుంచి ఆధ్యాత్మికం వైపు
ఆంక్షల నుంచి ఆధ్యాత్మికం వైపుగా అయోధ్య నగరం సాగుతోంది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అష్ట దిగ్బంధమైన రోడ్లు, ఆలయ పరిసర ప్రాంతాల్లో పరిస్థితులు వేగంగా చక్కబడుతున్నాయి. సోమవారం టెంపుల్ సిటీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. పలు మార్గాల్లో ఆంక్షలు సడలించడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. రామనామ స్మరణతో వీధులు ప్రతిధ్వనించాయి. దర్శనానికి సరిహద్దు ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. దీంతో పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు. తీర్పు తర్వాత తొలిసారి సిటీ, ఆలయ పరిసర ప్రాంతాల్లోకి వాహనాలను అనుమతించారు.
భక్తుల తాకిడి
పుహ్నాని(పౌర్ణమి)ని పురస్కరించుకుని సోమవారం ఉదయం నుంచే పెద్ద ఎత్తున భక్తులు ఆయోధ్యకు చేరుకున్నారు. కార్తీక సోమవారం సందర్భంగా సరయూ నది ఒడ్డున పుణ్య స్నానాలు ఆచరించి, రామచంద్రుని దర్శించుకున్నారు. నదీ తీరం కార్తీక దీపాలతో శోభాయమానంగా వెలిగిపోయింది. గుజరాత్, బీహార్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌గఢ్, హర్యానా నుంచి భక్తులు పెద్ద ఎత్తున వచ్చారు. హోటళ్లు, దుకాణాలు రద్దీగా కనిపించాయి. మంగళవారం కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని దాదాపు 8 లక్షల మంది భక్తులు శ్రీరాముడిని దర్శించుకునే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. దీంతో అదనంగా మరింత మంది పోలీసులను మోహరించారు. ముఖ్యమైన రహదారులు, ప్రధాన ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
ఏ నాడూ పూజలు ఆపలేదు
‘‘1992 నుంచి రామ్‌లల్లాకు సేవలందిస్తున్నా. ఏ నాడూ స్వామి వారికి పూజలు ఆపలేదు. గుడారంలో రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రఘ్నడు, లింగం, దుర్గా దేవి, రెండు హనుమాను విగ్రహాలు సహా మొత్తం 11 విగ్రహాలు ఉన్నాయి. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రఘ్నడి విగ్రహాలు అష్టధాతువులతో చేసినవి. స్వామి వారి కిరీటం వెండితో చేశారు. దానికి బంగారు పూత ఉంటుంది. గుడారం వెనక భాగంలో స్వామి వారి వస్త్రాలు, అలంకరణ సామగ్రి ఉంటుంది. తీర్పు నేపథ్యంలో శని, ఆది వారాల్లో భక్తుల రద్దీ తగ్గింది. సోమవారం మాత్రం పెరిగింది. ‑ సంజయ్ తివారీ, రామ్‌లల్లా పూజారి,