
గ్రేటర్ హైదరాబాద్ శివారు కాటేదాన్ పారిశ్రామిక వాడలోని రామకృష్ణ హోమియో ఫార్మసి మందుల కంపెనీని యాజమాన్యం మూసేసింది. దీంతో కంపెనీలో గత 30 ఏళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగుల పరిస్థితి అయోమయంగా మారింది. కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా యాజమాన్యం కంపెనీని మూసివేయడం తోపాటు స్థిరాస్తులను సైతం అమ్మి వేయడంతో ఉద్యోగులు కంపెనీ ఆవరణలో ఆందోళనకు దిగారు. 30 ఏళ్లుగా కంపెనీలో పనిచేస్తున్న తమకు గత ఐదేళ్ళుగా యాజమాన్యం ప్రావిడెంట్ ఫండ్ ను సైతం జమ చేయలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. మూడు నెలలుగా జీతాలు కూడా ఇవ్వడం లేదని మేనేజర్ ను, యాజమాన్యాన్ని ఈ విషయం అడిగితే త్వరలోనే ప్రావిడెంట్ ఫండ్ జమ చేయడంతో పాటు జీతాలు సైతం ఇస్తామని హామీ ఇచ్చారని బాధితులు పేర్కొంటున్నారు.
గతవారం రోజుల క్రితం రోజు మాదిరిగానే కంపెనీకి రాగా కంపెనీకి తాళం వేసి ఉందన్నారు బాధితులు. వివరాలు తెలుసుకోగా యాజమాన్యం కంపెనీకి సంబంధించిన స్థిరాస్తులను గుట్టు చప్పుడు కాకుండా అమ్మేసిందని, అనంతరం కంపెనీని మూసివేసి యాజమాన్యం వెళ్లిపోయిందని బాధిత ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగరానికి చెందిన కృష్ణారావు అనే వ్యక్తి సుమారు 40 సంవత్సరాల క్రితం కాటేదాన్ పారిశ్రామిక వాడలో రామకృష్ణ హోమియో ఫార్మసీ కంపెనీని ఏర్పాటు చేశారు. కొన్నాళ్లపాటు కంపెనీ బాగా నడిచిందన్నారు. ఇటీవల కరోనా సమయంలోను హోమియో మందులకు మంచి స్పందన రావడం కూడా జరిగింది. అయితే అప్పటికే నష్టాలలో కూరుకుపోయిన కంపెనీ తిరిగి కోలుకోలేని స్థితికి చేరుకుంది.
దీంతో కంపెనీ యాజమాన్యం కంపెనీని వదిలించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఆ క్రమంలోనే కంపెనీకి సంబంధించిన స్థిరాస్తులను యాజమాన్యం ఒకటొకటిగా అమ్మేసింది. వారం రోజుల క్రితం యాజమాన్యం ఏకంగా కంపెనీకి తాళం వేసి వెళ్ళిపోయిందని ఉద్యోగులు చెబుతున్నారు. కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఒక్కొక్కరికి 8 నుండి 12 లక్షల రూపాయల వరకు బకాయిలు ఉన్నాయని ఉద్యోగులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.