సూర్య వశిష్ట, దీప్షిక జంటగా విజయ్ ఆదిరెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘రమణి కళ్యాణం’. కైట్స్ క్రియేటివ్స్ బ్యానర్ పై విజయ్ ఆదిరెడ్డి, మనోజ్ చింతిరెడ్డి. శ్రీనాథ్ పసుపులేటి, సంజయ్ వెంపరాల నిర్మించారు. ‘కోర్ట్’ మూవీ ఫేం రామ్ జగదీష్ డైలాగ్స్ రాశారు. శుక్రవారం సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. నటులు ఆలీ, శ్రీనివాస్ రెడ్డి, నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ సినిమాకు బెస్ట్ విషెస్ తెలియజేశారు.
హీరో సూర్య వశిష్ట మాట్లాడుతూ ‘దర్శకుడు విజయ్ ఎంతో ప్యాషన్‌తో ఈ సినిమాను తీశారు. ఒక దర్శకుడిగా తొలి సినిమాకే ఇలాంటి కథను ఎంచుకోవడం మామూలు విషయం కాదు. చాలా గట్స్ ఉండాలి. అరుదుగా వచ్చే ఇలాంటి చిత్రాలను ఆదరించాలని కోరుకుంటున్నా’ అన్నాడు. ఇలాంటి కథా బలం ఉన్న చిత్రంలో నటించడం ఆనందంగా ఉందని దీప్షిక చెప్పింది.
దర్శకుడు విజయ్ ఆదిరెడ్డి మాట్లాడుతూ ‘మంచి కథతో పాటు ఎమోషన్స్, ఎంటర్‌టైన్మెంట్ ఉన్న సినిమా ఇది. థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక స్ట్రాంగ్ ఎమోషన్ ప్రేక్షకుల మనసును హత్తుకుంటుంది. మంచి ఫీలింగ్‌తో థియేటర్ నుంచి బయటకు వస్తారు’ అని చెప్పాడు. డైలాగ్స్ రాసిన దర్శకుడు రామ్ జగదీష్, రైటర్ యువరాజ్, మ్యూజిక్ డైరెక్టర్ సూరజ్, లిరిసిస్ట్ పూర్ణాచారి తదితరులు పాల్గొన్నారు.
