రామానుజచార్యుల సహస్రాబ్ది వేడుకలు ప్రారంభం

రామానుజచార్యుల సహస్రాబ్ది వేడుకలు ప్రారంభం

హైదరాబాద్ : ముచ్చింతల్లోని సమతా స్ఫూర్తి కేంద్రంలో రామానుజాచార్యుల సహస్రాబ్ది వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు కార్యక్రమానికి వివిధ పీఠాలకు చెందిన ఏడుగురు జీయర్ స్వాములు హాజరయ్యారు. సహస్రాబ్ది సమారోహాల్లో భాగంగా జీయర్ ఆస్పత్రి నుంచి యాగశాల వరకు శోభాయాత్ర నిర్వహించారు. త్రిదండి చిన్నజీయర్ స్వామితో పాటు పలువురు స్వామీజీలు, రుత్వికులు ఇందులో పాల్గొన్నారు. శోభాయాత్రను తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. శోభాయాత్ర అనంతరం వాస్తు శాంతి, రుత్విక వరణ కార్యక్రమాలు, సాయంత్రం 5 గంటలకు సహస్రాబ్ది ఉత్సవాలకు అంకురార్పణ జరగనుంది. అనంతరం అరణి మథనం, అగ్ని ప్రతిష్ట చేయనున్నారు. 

సమతా స్ఫూర్తి కేంద్రంలో ఇవాళ్టి నుంచి 14వ తేదీ వరకు సహస్రాబ్ది ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. లక్ష్మీ నారాయణ మహాయజ్ఞంతో పాటు 108 దివ్యదేశాల ప్రతిష్ఠ, కుంభాభిషేకం, స్వర్ణమయ రామానుజ ప్రతిష్ట, సమతామూర్తి లోకార్పణ జరగనుంది. ఈ ఉత్సవాలకు ఈ నెల 5న ప్రధాని నరేంద్రమోడీ, 7న రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, 8న హోం మంత్రి అమిత్ షా, 13న  రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ హాజరుకానున్నారు. ఉత్సవాల నేపథ్యంలో దాదాపు 7వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు.