అయోధ్య వచ్చే అతిథులకు రామయ్య కానుకలు

అయోధ్య వచ్చే అతిథులకు రామయ్య కానుకలు

లక్నో: అయోధ్యలో కొలువుదీరనున్న  శ్రీరాముడికి దేశవిదేశాల నుంచి కానుకలు వెల్లువెత్తుతున్నాయి. పాదుకలు, పట్టుపీతాంబరాలు, స్వర్ణాభరణాలు.. ఇలా రకరకాల కానుకలను భక్తులు సమర్పించుకుంటున్నారు. గుడి నిర్మాణానికి ప్రపంచం నలుమూలల నుంచి చందాలు వచ్చాయి. అయితే, ఇప్పుడు అయోధ్య రాముడు తన మందిరం ప్రారంభోత్సవానికి వచ్చే అతిథులకు కానుకలివ్వనున్నాడు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరైన ప్రతీ భక్తుడికి రాముడి తరఫున ఓ కానుకల సంచీని అందించనున్నట్లు ట్రస్ట్ సభ్యులు తెలిపారు. ఇందులో రామాలయ నిర్మాణం కోసం పునాది తీసిన మట్టి, మోతీచూర్ లడ్డూ, రామమందిరం ఫొటో ఉంటాయని వివరించారు. ప్రాణ ప్రతిష్ఠకు ఆహ్వానం అందినా సరే ఏదేనీ కారణంతో హాజరు కాలేక పోయిన భక్తులు.. తర్వాత ఎప్పుడైనా రాముడిని దర్శించుకుని, తమ కానుకను పొందవచ్చని తెలిపారు.

రాముడి గుడికి 50 కిలోల​ తాళం 

తాళాల తయారీకి పెట్టింది పేరైన అలీగఢ్.. అయోధ్య రామ మందిరం కోసం తయారుచేసిన తాళం ఇది. పూర్తిగా చేతితో 50 కిలోలతో ప్రత్యేకంగా తయారు చేయించినట్లు హరిసన్ లాక్స్ కంపెనీ ఎండీ ఉమాంగ్​ మోంగా తెలిపారు. రాముడికి అలీగఢ్​ కానుకగా సమర్పించడానికి దీనిని సిద్ధం చేసినట్లు వివరించారు.