రామాయంపేటకు బైపాస్ వద్దు .. ఎంపీకి తేల్చి చెప్పిన పట్టణ ప్రజలు

రామాయంపేటకు బైపాస్ వద్దు .. ఎంపీకి తేల్చి చెప్పిన పట్టణ ప్రజలు

రామాయంపేట, వెలుగు: రామాయంపేటలో బైపాస్ రోడ్డు వేస్తే తీవ్రంగా నష్టపోతామని, పాత రోడ్డునే మరింత విస్తరించాలని పట్టణ ప్రజలు కోరారు. బైపాస్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోనున్న రైతులు, వ్యాపారులతో శనివారం  ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు. విలువైన భూముల నుంచి రోడ్డు వేస్తే  తాము నష్టపోవడమే కాకుండా, పట్టణ అభివృద్ధి కుంటుపడుతుందని దీనిని దృష్టిలో పెట్టుకొని పాత రోడ్డునే విస్తరించాలని ఎంపీని కోరారు. రోడ్డు ఏర్పాటుకు భూములు ఇచ్చేది లేదని వారు తేల్చి చెప్పారు. అంతకు ముందు ఎంపీ రఘునందన్​రావు మాట్లాడుతూ పట్టణ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. 

ప్రజలు దానికి సహరించాలని కోరారు. 2022 డిసెంబర్ లోనే ఈ రోడ్డు త్రీడీ సర్వే జరిగిందని, ఆ భూములు నేషనల్ హైవే వారికే చెందినవన్నారు. మే 10 న హైదరాబాద్ కు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వస్తున్నారని, ఈ బైపాస్ రోడ్డు  అభ్యంతరాలను ఆయనకు  విన్నవించాలన్నారు. అందుకు తగిన ఏర్పాట్లు చేస్తానని తెలిపారు. ముందస్తుగా ఎవరి భూములు ఎంత పోతున్నాయని సర్వే ద్వారా తేలుతుందని, అందుకు రైతులు సహకరించాలని కోరారు. అడిషనల్ కలెక్టర్ నగేశ్, ఆర్డీవో రమాదేవి, తహసీల్దార్ రజిని పాల్గొన్నారు.