రామాయంపేట, వెలుగు: ఎన్నికల సంఘం నియమాలను ఖచ్చితంగా పాటించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. గురువారం రామాయంపేటలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ హాల్, స్ట్రాంగ్ రూమ్‌లను ఆయన మెదక్ ఆర్డీవో రమాదేవితో కలిసి పరిశీలించారు. ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సంబంధించి అన్ని ఏర్పాట్లు, కౌంటింగ్ హాల్ పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచనున్న బ్యాలెట్ పేపర్ల భద్రత, సీసీ కెమెరాల ఏర్పాటు, మూడు అంచెల భద్రత, అగ్నిమాపక పరికరాలు, విద్యుత్ సరఫరా తదితర అంశాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
కౌంటింగ్ హాల్‌లో టేబుళ్ల ఏర్పాటు, సిబ్బంది కూర్చునే విధానం, ప్రవేశ-నిష్క్రమణ మార్గాలు, కంట్రోల్ రూమ్ ఏర్పాట్లపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని, ఓట్ల లెక్కింపు పూర్తిగా పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అంతకు ముందు అక్కన్నపేట హైస్కూల్ కు ఆకస్మికంగా వెళ్లారు. అక్కడి విద్యార్థుల సంఖ్య, మధ్యాహ్న భోజనం తీరును పరిశీలించారు. అనంతరం పట్టణం లోని గ్రోమోర్ షాపునకు వెళ్లి ఎరువుల స్టాక్ వివరాలను తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఎరువులు అమ్మాలని, అధిక ధరలకు అమ్మితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
