ఓటర్ లిస్టులను ట్యాంపర్ చేస్తున్నరు!.. మజ్లిస్‌కు లాభం చేసేందుకే కాంగ్రెస్ స్కెచ్: రాంచందర్ రావు

ఓటర్ లిస్టులను ట్యాంపర్ చేస్తున్నరు!.. మజ్లిస్‌కు లాభం చేసేందుకే కాంగ్రెస్ స్కెచ్: రాంచందర్ రావు
  •     న్యాయం కోసం లీగల్ సెల్ లాయర్లు కొట్లాడాలని పిలుపు

హైదరాబాద్, వెలుగు:  రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ సర్కార్ అడ్డదారులు తొక్కుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆరోపించారు. హైదరాబాద్‌ లో మజ్లిస్ పార్టీకి ఎక్కువ సీట్లు రావాలనే ఉద్దేశంతో ఓటర్ లిస్టులను ట్యాంపర్ చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. శనివారం నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీసులో పార్టీ లీగల్ సెల్ సమావేశం జరిగింది. 

ఈ సమావేశానికి రాంచందర్ రావు హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు డబ్బు, మతాన్ని అడ్డుపెట్టుకొని పాలిటిక్స్ చేస్తున్నాయని మండిపడ్డారు. మున్సిపాలిటీల్లో ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై, ఓటర్ లిస్టుల్లోని అవకతవకలపై లీగల్ సెల్ లాయర్లు గట్టిగా కొట్లాడాలని పిలుపునిచ్చారు.  

కాంగ్రెస్ లీడర్లు  ఇండిపెండెంట్ బాడీ అయిన ఎలక్షన్ కమిషన్‌పై అనుమానాలు రేకెత్తిస్తున్నారని రాంచందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘రాహుల్ గాంధీకి బుద్ధి చోరీ అయ్యింది.. అందుకే ఓట్​ చోరీ అని మాట్లాడుతున్నడు. రాష్ట్రంలో వీబీ జీ రామ్‌జీ పథకంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోంది’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోహింగ్యాలు మజ్లిస్ పార్టీకి మద్దతుగా ఉన్నారని.. అందుకే ఓటర్ లిస్టులను ఇష్టమొచ్చినట్టు మారుస్తున్నారని ఆరోపించారు. 

రాష్ట్రంలోని మున్సిపాలిటీలు కేంద్రం ఇచ్చే నిధులతోనే నడుస్తున్నాయని.. ఇప్పటి వరకు కేంద్రం రూ.12 వేల కోట్లు ఇచ్చిందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ సర్కార్ రాష్ట్రాన్ని దోచుకుంటోందన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ లీగల్ సెల్ 24 గంటలు ప్రజాసేవలో ఉండాలని.. అభ్యర్థులకు లీగల్‌గా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ వార్డుల డీలిమిటేషన్‌పై హైకోర్టులో కొట్లాడుతున్నామని.. ఇదే స్ఫూర్తితో మున్సిపల్ ఎన్నికల్లోనూ అన్యాయాన్ని ఎక్కడికక్కడ అడ్డుకోవాలని దిశానిర్దేశం చేశారు. 

రేషన్ సంచులపై మోదీ ఫొటో ఉండాలి

రాష్ట్ర ప్రజలకు కేంద్ర ప్రభుత్వమే రేషన్ బియ్యం ఇస్తున్నదని..ఇందుకోసం 100 శాతం నిధులిస్తున్నా సంచులపై మాత్రం ప్రధాని మోదీ ఫొటో ఎందుకు పెడతలేరని రాంచందర్‌‌ రావు ప్రశ్నించారు.  రేషన్ సంచులపై, రశీదులపై మోదీ ఫొటో పెట్టాలని డిమాండ్​ చేశారు. శనివారం ఆయన నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీసులో 2026 డైరీని ఆవిష్కరించారు.