మోదీ సారథ్యంలో అద్భుత ప్రగతి : రాంచందర్ రావు

మోదీ సారథ్యంలో అద్భుత ప్రగతి : రాంచందర్ రావు
  •     కాశ్మీర్ ఆజాదీ శక్తులకు కాంగ్రెస్ సపోర్ట్ చేయడం సిగ్గుచేటు: రాంచందర్ రావు
  •     బీజేపీ స్టేట్ ఆఫీసులో ఘనంగా 80వ స్వాతంత్ర్య వేడుకలు

హైదరాబాద్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో భారత్ ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని.. అన్ని రంగాల్లో అద్భుత ప్రగతి సాధిస్తూ సూపర్ పవర్ గా ఎదిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అన్నారు. శనివారం నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీసులో 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. 

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం రాంచందర్​రావు  మాట్లాడుతూ.. గత 12 ఏండ్లలో దేశం ఐటీ, సెమీ కండక్టర్లు, రక్షణ రంగాల్లో స్వయంసమృద్ధి సాధించిందని చెప్పారు. నాడు 6 ఐఐటీలే ఉండగా నేడు ఆ సంఖ్య 20కి చేరిందని, ఎయిమ్స్, ఐఐఎంలు కూడా భారీగా పెరిగాయని చెప్పారు. దేశ వ్యతిరేక శక్తులకు కాంగ్రెస్ పార్టీ వత్తాసు పలుకుతోందని రాంచందర్ రావు అన్నారు. వర్సిటీల్లో కాశ్మీర్ ఆజాదీ స్లోగన్స్ ఇచ్చేవారికి, అఫ్జల్ గురు మద్దతుదారులకు కాంగ్రెస్ సపోర్ట్ చేయడం సిగ్గుచేటన్నారు. లోక్‌‌సభ ప్రతిపక్ష నేత బాధ్యతాయుతమైన పదవిలో ఉండి వీధి నాటకాలు ఆడుతూ దేశం తలదించుకునేలా చేస్తున్నారని విమర్శించారు. విభజన రాజకీయాలు చేయడం కాంగ్రెస్‌‌కు అలవాటేనన్నారు. 

తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టారు..

గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని రూ. 4.5 లక్షల కోట్ల అప్పుల్లో ముంచితే.. కాంగ్రెస్ మరో రూ. 2 లక్షల కోట్ల భారం మోపిందని రాంచందర్ రావు ఆరోపించారు. 6 గ్యారెంటీలను బుట్టదాఖలు చేసిందని, విద్యార్థులకు అందాల్సిన రూ. 12 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌‌మెంట్ ఇవ్వకుండా వారి భవిష్యత్తుతో ఆడుకుంటోందని విమర్శించారు.  తెలంగాణ అభివృద్ధికి కేంద్రమే పెద్దపీట వేస్తోందని రాంచందర్ రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇచ్చే ఉచిత బియ్యానికి 90 శాతం నిధులు మోదీ ప్రభుత్వమే ఇస్తోందన్నారు. 

సమ్మక్క-సారలమ్మ వర్సిటీ, రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, కాజీపేట వ్యాగన్ యూనిట్, రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ వంటివన్నీ కేంద్రం చలవేనని.. కానీ, స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధాని ఫొటో పెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను వంచిస్తోందని విమర్శించారు. వందేమాతరం గేయాన్ని అవమానించే మజ్లిస్ నేతల తీరును సమాజం అసహ్యించుకుంటోందని, దేశ వ్యతిరేక శక్తులకు ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎంపీలు కె. లక్ష్మణ్, ఈటల రాజేందర్ సహా పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు