ఆసియా సర్ఫింగ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌ ఫైనల్లో రమేశ్‌‌

ఆసియా సర్ఫింగ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌ ఫైనల్లో రమేశ్‌‌

చెన్నై: ఇండియా సర్ఫర్‌‌ రమేశ్‌‌ బుధియల్‌‌.. ఆసియా సర్ఫింగ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్‌‌ సర్ఫర్‌‌గా రికార్డులకెక్కాడు. శనివారం జరిగిన ఓపెన్‌‌ మెన్స్‌‌ సెమీస్‌‌లో రమేశ్‌‌ 11.43 పాయింట్లతో రెండో ప్లేస్‌‌లో నిలిచి టైటిల్‌‌ పోరుకు అర్హత సాధించాడు. 

పాజర్‌‌ అరియానా (ఇండోనేసియా) 13.83 పాయింట్లతో టాప్‌‌ ప్లేస్‌‌ను సొంతం చేసుకున్నాడు. అంతకుముందు జరిగిన క్వార్టర్‌‌ఫైనల్‌‌ హీట్‌‌ రేసును కూడా రమేశ్‌‌ 14.84 పాయింట్లతో ముగించాడు. తద్వారా ఫిలిప్పీన్స్‌‌కు చెందిన నీల్‌‌ సాంచెస్‌‌ (12.80 పాయింట్లు) వెనక్కి నెట్టి సెమీస్‌‌కు దూసుకొచ్చాడు. ఇండియాకే చెందిన కిశోర్‌‌ కుమార్‌‌ సెమీస్‌‌లో 8.03 పాయింట్లతో నాలుగో ప్లేస్‌‌తో సంతృప్తిపడ్డాడు. 

క్వార్టర్స్‌‌ హీట్‌‌–4లో కిశోర్‌‌ 10.50 పాయింట్లతో సెమీస్‌‌కు అర్హత సాధించాడు. మరో క్వార్టర్స్‌‌లో సర్ఫర్‌‌ డి. శ్రీకాంత్‌‌ 10.90 పాయింట్లతో నిష్క్రమించాడు. అండర్‌‌–18 బాయ్స్‌‌ సెక్షన్‌‌లో హరీశ్‌‌, ఆద్యా సింగ్‌‌, గర్ల్స్‌‌లో దమయంతి శ్రీరామ్‌‌ క్వార్టర్స్‌‌లోనే వెనుదిరిగారు.