
చెన్నై: ఇండియా సర్ఫర్ రమేశ్ బుధియల్.. ఆసియా సర్ఫింగ్ చాంపియన్‌షిప్‌లో చరిత్ర సృష్టించాడు. ఆదివారం జరిగిన ఓపెన్ మెన్స్ కేటగిరీలో రమేశ్ 12.60 పాయింట్లు సాధించి బ్రాంజ్ మెడల్ సొంతం చేసుకున్నాడు. దాంతో ఈ టోర్నీలో పతకం నెగ్గిన తొలి ఇండియన్‌గా రికార్డులకెక్కాడు. కొరియా సర్ఫర్ కనోవా హీజే (15.17), పాజర్ అరియానా (ఇండోనేషియా, 14.57) వరుసగా గోల్డ్, సిల్వర్ సాధించారు.
ఓపెన్ విమెన్స్ కేటగిరీలో జపాన్ సర్ఫర్లు అన్రి మట్సునో (14.90), సుమోమో సాటో (13.70) వరుసగా గోల్డ్, సిల్వర్ కైవసం చేసుకున్నారు. ఇసాబెల్ హిగ్స్ (థాయ్‌లాండ్, 11.76) బ్రాంజ్‌తో సరిపెట్టుకుంది. అండర్–18 బాలుర విభాగంలోనూ కనోవా హీజే 14.33 పాయింట్లతో బంగారు పతకాన్ని నెగ్గాడు. చైనా ద్వయం షిడాంగ్ వు (13.10), షులో జియాంగ్ (8) వరుసగా రజత, కాంస్యం సంపాదించారు.