- ఓ పక్కన జీహెచ్ఎంసీ, మరో పక్కన ఎన్జీటీ
- రూల్స్ వాయిలేషన్ చేస్తుండడంతో ఫైన్స్
హైదరాబాద్ సిటీ, వెలుగు: చెత్త సేకరణ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న రాంకీకి జరిమానాల మోత ఆగట్లేదు. ఓ పక్కన జీహెచ్ఎంసీ, మరో పక్కన జవహర్ నగర్‌లోని డంపింగ్ యార్డులో రూల్స్ వాయిలేషన్స్ చేస్తున్నారని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) ఫైన్లు వేస్తోంది.
డంపింగ్ యార్డుకు ఫ్రెష్ గార్బేజ్ తరలించవద్దని, అలాగే వేస్ట్ టూ ఎనర్జీ కోసం వాడే ఆర్డీఎఫ్ వినియోగించవద్దని గత నెల 28న ఎన్జీటీ తీర్పు చెప్పింది. జవహర్‌నగర్‌లో ఇప్పటికే 15 లక్షల టన్నుల చెత్త పేరుకుపోవడంతో కొత్త చెత్త వేయడం వల్ల సమస్య మరింత ఎక్కువవుతుందని పేర్కొంది. ఈ తీర్పుపై ఈ నెల 10న మరోసారి విచారణ జరిగింది. మళ్లీ చెత్త వేస్తున్నారని తేలడంతో రూ.లక్ష ఫైన్ వేసింది. రిపీట్ అయితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్జీటీ హెచ్చరించింది.
అగ్రిమెంట్ ప్రకారం పనిచేయట్లేదని బల్దియా..
అగ్రిమెంట్ ప్రకారం రాంకీ పనిచేయడం లేదని, ఆ సంస్థ నిర్లక్ష్యంతో నగరంలో శానిటేషన్ సమస్య తీవ్రమవుతుందని జీహెచ్ఎంసీ కూడా రాంకీ సంస్థపై కొరఢా ఝులిపిస్తోంది. కార్వాన్, జూబ్లీహిల్స్ సర్కిళ్లలో రోడ్లపై చెత్త ఎత్తలేదని సెప్టెంబర్ 22న ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ రూ.లక్ష ఫైన్ వేశారు. ఆ తరువాత గార్బేజ్ వల్నరబుల్ పాయింట్ల వద్ద టైమ్‌కు చెత్త ఎత్తడం లేదని గత నెలలో ఒకటి, రోడ్లపై వ్యర్థాలను తరలించడం లేదని మరొక నోటీసు ఇచ్చారు. పనులు చేయకపోతే ఏజెన్సీని రద్దు చేసేందుకు సైతం వెనక్కి తగ్గేది లేదని కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఇప్పటికే హెచ్చరించారు.
GHMC లో టన్ను చెత్తకు రూ.2,750..జీవీపీ పాయింట్ల నుంచి చెత్తను డంపింగ్ యార్డుకు తరలింపు
నగరంలో చెత్తను తరలించేందుకు 2009లో రాంకీ సంస్థతో 25 ఏండ్లకు జీహెచ్ఎంసీ అగ్రిమెంట్ చేసుకుంది. ఒప్పందం ప్రకారం సిటీలో ప్రతి ఇంటి నుంచి చెత్తను తరలించడంతో పాటు రోడ్లపై జీవీపీ పాయింట్ల నుంచి చెత్తను డంపింగ్ యార్డుకు తరలించాలి. అది కూడా రోజూ ఉదయం 9:30 గంటల లోపు మాత్రమే. ఎక్కడ కూడా ఆ తర్వాత చెత్త కనిపించొద్దు. అయితే ఇంటింటి నుంచి చెత్తను స్వచ్ఛ ఆటోలు సేకరించి ట్రాన్స్ ఫర్ స్టేషన్లకు తరలిస్తుండడంతో రాంకీకి వచ్చిన ఇబ్బంది కూడా ఏం లేదు. అయినప్పటికీ చెత్తను తరలించడంతో రాంకీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అధికారులంటున్నారు. నగరంలో రోజూ 7,500 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుండగా, చెత్తను తరలించేందుకు రాంకీకి బల్దియా టన్నుకు రూ.2,750 చెల్లిస్తుండగా, నగరంలో 7500 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంది.

